ఆర్థిక వ్యవస్థకు దన్నుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై చర్చలు పురోగతి సాధించడంతో మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. లాభాలతో ముగిశాయి. డోజోన్స్ 113 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 28,309 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 16 పాయింట్ల(0.5 శాతం) బలపడి 3,443 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్ సైతం 38 పాయింట్లు(0.35 శాతం) లాభపడి 11,516 వద్ద స్థిరపడింది.
వారాంతంలోగా
ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో నిర్వహిస్తున్న చర్చలను బుధవారం సైతం కొనసాగించనున్నట్లు నాన్సీ పెలోసీ తాజాగా పేర్కొన్నారు. తద్వారా వారాంతంలోగా ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ లభించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీనికితోడు సహచర రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. భారీ ప్యాకేజీకి సిద్ధమంటూ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వెరసి మరోసారి వైట్‌హౌస్ నుంచి భారీ ప్యాకేజీకి ఆమోదముద్ర పడవచ్చని అంచనా వేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ పతనం
ఈ ఏడాది క్యూ3(జులై-సెప్టెంబర్)లో పెయిడ్ సబ్‌స్క్యయిబర్ల సంఖ్య అంచనాలను చేరకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ షేరు 1 శాతం డీలాపడింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడటంతో ఫ్యూచర్స్‌లో 4 శాతం నష్టపోయింది. కాగా.. మార్కెట్లో గల ఆధిపత్యంతో ప్రత్యర్థి సంస్థలను అణచివేస్తున్నట్లు గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్‌పై కేసులు దాఖలయ్యాయి. అయినప్పటికీ అల్ఫాబెట్ షేరు 1.4 శాతం పుంజుకుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ, ఇంజినీరింగ్ తదితర పలు విభాగాలలో ఇప్పటికే గూగుల్ బిలియన్లకొద్దీ డాలర్లను వెచ్చించినట్లు టీఎంటీ రీసెర్చ్ పేర్కొంది. దశాబ్ద కాలంలో కంపెనీ సాధించిన వృద్ధిని కాదనలేమని ఈ సందర్భంగా టీఎంటీ రీసెర్చ్ హెడ్ నీల్ క్యాంప్లింగ్ పేర్కొన్నారు. ఇతర టెక్ కౌంటర్లలో ఫేస్‌బుక్ 2.4 శాతం లాభపడగా.. యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ 1.3-0.3 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా 2 శాతం క్షీణించింది.
పీఅండ్‌జీ ప్లస్
క్యూ3(జులై-సెప్టెంబర్)లో అంచనాలు మించిన ఫలితాలతో బీమా రంగ సంస్థ ట్రావెలర్స్ కంపెనీస్ షేరు 5.6 శాతం జంప్‌చేసింది. పూర్తి ఏడాది(2020)కి ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడంతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం పీఅండ్‌జీ 0.4 శాతం పుంజుకుంది. ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 0.5 శాతం లాభపడగా.. ఫైజర్ 0.8 శాతం, ఆస్ట్రాజెనెకా 0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment