![US Market plunges on president Trump comments on stimulus - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/7/Donald-Trump.jpg.webp?itok=aQbwObCT)
అధ్యక్ష ఎన్నికలయ్యే వరకూ డెమొక్రాట్లతో సహాయక ప్యాకేజీలపై చర్చలు నిర్వహించేదిలేదంటూ ట్రంప్ తాజాగా స్పష్టం చేయడంతో మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. డోజోన్స్ 376 పాయింట్లు(1.3%) క్షీణించి 27,773 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 48 పాయింట్లు(1.4%) బలహీనపడి 3,361 వద్ద ముగిసింది. నాస్‌డాక్ మరింత అధికంగా 178 పాయింట్లు(1.6%) పతనమై 11,155 వద్ద స్థిరపడింది. కోవిడ్19 నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ కోలుకోవడంతో ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలతో సోమవారం మార్కెట్లు జంప్‌చేసిన సంగతి తెలిసిందే.
ఏం జరిగిందంటే?
హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కొన్ని రాష్ట్రాల కోసం ప్రతిపాదిస్తున్న 2.4 ట్రిలియన్ డాలర్ల బెయిలవుట్ కోవిడ్-19కు వినియోగం కోసంకాదని ట్రంప్ విమర్శించారు. అయినాగానీ తాము ఎంతో ఉదారంగా 1.6 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రతిపాదించామని పేర్కొన్నారు. ఇందుకు డెమక్రాట్లు అంగీకరించకపోవడంతో ఎన్నికలు ముగిసేవరకూ చర్చలు నిలిపివేయాల్సిందిగా తమ ప్రతినిధులను ఆదేశించినట్లు ట్రంప్ తెలియజేశారు. ఎన్నికల్లో గెలిచాక కష్టపడి పనిచేస్తున్న అమెరికన్లతోపాటు.. చిన్న వ్యాపారాలకు మేలు చేసేలా బెయిలవుట్ బిల్లును పాస్ చేస్తామని పేర్కొన్నారు. కాగా.. ఆర్థిక రికవరీకి మరో భారీ ప్యాకేజీ అవసరమున్నట్లు తాజాగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక దన్ను లభించకుంటే.. జీడీపీ రికవరీ నెమ్మదించే వీలున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెంటిమెంటు బలహీనపడి ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు.
ఫాంగ్ స్టాక్స్ వీక్
మంగళవారం ట్రేడింగ్ లో బ్లూచిప్ స్టాక్ బోయింగ్ 7 శాతం పతనంకాగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 3 శాతం క్షీణించింది. ఫాంగ్ స్టాక్స్‌లో యాపిల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, 3-1.5 శాతం మధ్య నష్టపోయాయి. ఇతర కౌంటర్లలో ఫార్మా దిగ్గజాలు మోడర్నా ఇంక్, ఫైజర్ 1.5 శాతం చొప్పున డీలాపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment