హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ సెకండ్ హ్యాండ్ కార్ల పరిశ్రమకు కరోనా మహమ్మారి కలిసొచ్చింది. వైరస్ నేపథ్యంలో ప్రజా రవాణా సాధనాలను వినియోగించడం రిస్క్ అనే భావన పెరగడంతో సొంత వాహన కొనుగోళ్ల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కారుకు బదులుగా సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లకే జై కొడుతున్నారు. ఫస్ట్ టైమ్ కార్ కొనుగోలుదారులు యూజ్డ్ కార్లకే ఆసక్తి చూపిస్తుండటంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది.
ప్రతి ఏటా దేశవ్యాప్తంగా యూజ్డ్ లేదా సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. గత రెండు సంవత్సరాలలో యూజ్డ్ కార్లకు, పాత కార్ల మధ్య నిష్పత్తి 1.4 నుంచి 1.6కి పెరిగింది. గతేడాది దేశంలో 37 లక్షల సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయమయ్యాయి. సమీప భవిష్యత్తులో ఈ సంఖ్య 40 లక్షలకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త కార్ల కొనుగోలు ఎంక్వైరీలు 16 శాతం క్షీణిస్తే.. సెకండ్ హ్యాండ్ కార్ల ఎంక్వైరీలు మాత్రం 10 శాతం పెరిగాయని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శషాంక్ శ్రీవాస్తవ తెలిపారు. డిజైర్, బ్యాలెనో, స్విఫ్ట్ వంటి 7 ఏళ్ల క్రితంనాటి కార్ల ధరలు సగటున రూ.3.3 లక్షలుగా ఉంది. ఏడేళ్లు దాటినవయితే రూ.1.60 లక్షలకు దొరుకుతున్నాయి. (18 ఏళ్లు పైబడిన వారికి టీకా: ఖర్చు ఎంతో తెలుసా?)
వ్యవస్థీకృత మార్కెట్ వాటా 20%..
దేశీయ యూజ్డ్ కార్ల మార్కెట్‌లో ఎక్కువ భాగం వ్యవస్థీకృత రంగంలోనే ఉంది. మారుతీ సుజుకీ ట్రూ వ్యాల్యూ, హోండా ఫస్ట్ చాయిస్, టాటా మోటార్స్ అష్యూర్డ్ వంటి వ్యవస్థీకృత కార్ల కంపెనీలతో పాటు స్పిన్నీ వంటి స్టార్టప్ కంపెనీలు కూడా సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్నాయి. యూజ్డ్ కార్ల పరిశ్రమలో వ్యవస్థీకృత రంగం వాటా 20 శాతం వరకుంటుంది. యూజ్డ్ కార్ల మార్కెట్‌లో 55 శాతం అమ్మకాలు కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ సేల్స్ ఉంటాయని శ్రీవాస్తవ చెప్పారు. గతేడాది కంటే ప్రస్తుతం యూజ్డ్ కార్ల వ్యవస్థీకృత కంపెనీలు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. (కరోనా ముప్పు: ఎస్‌బీఐ సంచలన రిపోర్ట్)
యూజ్డ్ కార్లకే ఫస్ట్ టైమ్ బయ్యర్ ఓటు..
ద్విచక్ర వాహనం నుంచి కారు కొనుగోళ్లకు.. ఇందులోనూ తొలిసారి కారు కొనుగోలుదారులు క్రమంగా పెరుగుతున్నారు. యూజ్డ్ కార్ల మార్కెట్‌లో వేగాన్ని బట్టి గేర్లను నియంత్రించే ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఈ తరహా కార్ల విభాగం రెండంకెల వృద్ధిని సాధిస్తుందని అంచనా వేశారు. గతేడాది ఎనిమిదేళ్లుగా ఉన్న యూజ్డ్ కార్ల సగటు వయసు ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాలకు పెరిగిందని చెప్పారు. తొలిసారి కారు కొనుగోలుదారులు సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకే మక్కువ చూపుతున్నారు. 2018–19 లో మొత్తం యూజ్డ్ కార్ల విక్రయాలలో ఫస్ట్ టైమ్ కారు కొనుగోలుదారులు వాటా 62 %గా ఉండగా.. ప్రస్తుతం ఇది 70%కి పెరిగిందని తెలిపారు.
టాప్‌గేర్‌లో ట్రూ వ్యాల్యూ సేల్స్..
మారుతీ సుజుకీ ట్రూ వ్యాల్యూ బ్రాండ్ పేరిట యూజ్డ్ కార్లను విక్రయిస్తుంది. ఏటా 4,20 లక్షల కార్లను విక్రయిస్తుంది కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ట్రూ వ్యాల్యూకి 2.3 మిలియన్ల ఎంక్వైరీలు వచ్చాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఎంక్వైరీలు పెరిగాయి కానీ విక్రయాలు తగ్గాయని శ్రీవాస్తవ తెలిపారు. 2016-17లో 3,46,603 సెకండ్స్ కార్లను విక్రయించగా.. 2017-18లో 3,54,135 యూనిట్లు, 2018-19లో 4,22,892 వాహనాలు, 2019-20లో 4,18,897 కార్లను విక్రయించింది. ట్రూ వ్యాల్యూలో ఫస్ట్ టైం కారు కొనుగోలుదారుల విభా గం 3% మేర వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్‌లో ట్రూ వ్యాల్యూ విక్రయాలు 12 శాతం క్షీణించాయి. ఉత్తరప్రదేశ్‌లో స్థిరంగా ఉన్నాయి.
ఓడోమీటర్ల టాంపరింగ్ ఉండదు..
ఆర్గనైజ్ కంపెనీల యూజ్డ్ కార్లలో వాహనం తిరిగిన కిలో మీటర్లను తగ్గించే ఓడోమీటర్ల టాంపరింగ్ వంటి వాటికి అవకాశం ఉండదు. నాణ్యమైన కార్లను విక్రయించడంతో పాటు వారంటీ, మెయింటనెన్స్ రికార్డ్స్, ఇతరత్రా పారదర్శకమైన ఆఫర్లను అందిస్తుండటంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందని రీసెర్చ్ అండ్ అనలిటిక్ట్స్ కంపెనీ ఐహెచ్ మార్కిట్, పవర్‌ట్రెయిన్ అండ్ కంప్లెయిన్స్ ఫోర్‌కాస్ట్‌కు నాయకత్వం వహిస్తున్న సూరజ్ ఘోష్ తెలిపారు. ఉదాహరణకు మారుతీ ట్రూ వ్యాల్యూ ఇద్దరు యజమానుల కంటే ఎక్కువ చేతులు మారిన కార్లను
విక్రయించదు.
ట్రూ వ్యాల్యూ సేల్స్ ఎలా ఉన్నాయంటే?
సంవత్సరం విక్రయాల సంఖ్య
2016–17 3,46,603
2017–18 3,54,135
2018–19 4,22,892
2019–20 4,18,897
Comments
Please login to add a commentAdd a comment