లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో 2030 తర్వాత భారత్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలనే విక్రయిస్తామని ప్రకటించింది. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోందని కంపెనీ ఆసియా పసిఫిక్ హెడ్ మార్టిన్ పెర్సన్ తెలిపారు. 2025లో ఈసీ30 అనే ఈవీ మోడల్‌ను ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘వోల్వో కార్స్ 2030 తర్వాత భారత్‌లో కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే లాంచ్ చేస్తుంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల విక్రయాన్ని ఆలోపే నిలిపేస్తాం. ఈవీ కార్ల మార్కెట్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఇంధనంతో నడిచే ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ కార్లతో ఎలక్ట్రిక్ వాహనాలు పోటీ పడుతున్నాయి. దాంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కంపెనీ ఈవీలు 25 శాతం అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. మార్కెట్‌లోకి మరిన్ని మోడళ్లు వస్తే కొత్త కస్టమర్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. 2025లో ఈసీ30 అనే ఈవీ మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరిస్తాం. దానికి సంబంధించిన విషయాలను త్వరలో ప్రకటిస్తాం. తర్వాత అదే సిరీస్‌లో టాప్ఎండ్ మోడల్ ఈసీ90ను తీసుకొస్తాం. ప్రస్తుతం భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జపాన్, కొరియా దేశాల మాదిరిగానే దాదాపు 2 శాతానికే పరిమితమయ్యాయి’ అని తెలిపారు.
ఇదీ చదవండి: ‘48 వేలమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తాం..’
భారత్‌లో మరింత వృద్ధి చెందడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రముఖ కంపెనీలు భారత్ ఈవీ పరిశ్రమలో ప్రవేశించాయని చెప్పాయి. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ పథకాన్ని కంపెనీ అధ్యయనం చేస్తున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment