భారత్‌లో ఉపాధి కల్పించే రంగాల్లో వ్యవసాయం కీలకపాత్రం పోషిస్తోంది. దేశంలో 42 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ సర్కారు హామీ గతంలో కరోనా, ఆర్థిక సంక్షోభాల కారణంగా పూర్తి కాలేదు. అసలే ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగాల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ సమయంలో దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగంపై దీని ప్రభావం పడకుండా చూసుకోవడం కేంద్రానికి సవాలుగా మారనుంది. దీనికి తోడు వ్యవసాయం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకోవడం కీలకం. అప్పుడే ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా అన్నదాత ఆదాయం హెచ్చవుతుందని నిపుణలు చెబుతున్నారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో నీటిపారుదల రంగానికి కేటాయింపులు, నాణ్యమైన విత్తనాలు, టెక్నాలజీ వంటివి ఆర్థిక మంత్రికి కీలకంగా మారనున్నాయి.
సవాలు విసురుతున్న పరిస్థితులు..
వ్యవసాయ, పశుపోషణ రంగానికి కీలకమైన డీజిల్, విద్యుత్తు, పశువుల దాణా, మేత ఖర్చులు విపరీతంగా పెరిగాయి. వ్యవసాయ రంగంలో ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా పెరుగుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఈ ఏడాది ఆలస్యం కావడంతో పంట దిగుబడుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దాంతో కొన్ని ప్రాంతాల్లో ఆహారకొరత ఏర్పడుతోంది. వ్యవసాయ ఎగమతులు తగ్గుతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు గోధుమ పంటను దెబ్బతీశాయి. గోధుమలు, చక్కెర ఉత్పత్తులను కేంద్రం ఇప్పటికే నిలిపేసింది.
ఆధునికీకరణకే పెద్దపీట..
భారత్‌లో వ్యవసాయం సంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతోంది. దీనికి భిన్నంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. దీంతో వాటి ఉత్పత్తుల నాణ్యత కూడా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో మన రైతులు అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. భారత్‌లో రైతుల ఉత్పత్తి.. అంతర్జాతీయ మార్కెట్ల అంచనాలకు మధ్య చాలా అంతరం ఉంది. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించే పాలసీలను తీసుకురావాల్సి ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. రైతులకు సాంకేతికత, దానికి సంబంధించిన పరికరాలు చౌకగా లభించేందుకు ఈ రంగంలోని స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెబుతున్నారు.
వ్యవసాయ రంగంలో టెక్నాలజీని తీసుకురావడానికి 2022 బడ్జెట్‌లోనే పునాదులు వేశారు. కిసాన్ డ్రోన్లను ప్రమోట్ చేసేలా అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు నాబార్డ్ కింద ఓ నిధిని ఏర్పాటు చేసింది. బ్లాక్‌చైన్, కృత్తిమ మేధ, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను వ్యవసాయ రంగానికి అన్వయించడమే అసలైన సవాలు. 2024-25 బడ్జెట్‌లో వీటికి ప్రత్యేక కేటాయిపులు చేయడంతో పాటు.. పన్ను రాయితీలు ఇవ్వాలని కొందరు కోరుతున్నారు.
వ్యవసాయ రుణాలు రూ.22-25 లక్షల కోట్లు..?
2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈమేరకు ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న తాత్కాలిక బడ్జెట్‌లో ప్రతిపాదిస్తారని సమాచారం. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణాలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.20 లక్షల కోట్లు. ప్రస్తుతం రూ.3 లక్షల వరకు ఇచ్చే స్వల్పకాల వ్యవసాయ రుణాలపై 2% వడ్డీ రాయితీని ప్రభుత్వం ఇస్తోంది.
ఇదీ చదవండి: నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే..
అందువల్లే రూ.3 లక్షల వరకు రుణాలు 7% వడ్డీ రేటుకే లభిస్తున్నాయి. గడువులోపు బకాయిలు తీర్చేవారికి అదనంగా మరో 3% వడ్డీ మినహాయింపూ ఉంటుంది. దీర్ఘకాల రుణాలనూ రైతులు తీసుకోవచ్చు కానీ.. మార్కెట్ రేటు ప్రకారమే వడ్డీ రేటు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment