బతుకు భారమై వృద్ధుడు..
బైరెడ్డిపల్లె : వృద్ధాప్యం మీద పడటంతో పాటు బతుకు భారమై జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కొత్తయిండ్లు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గుర్రప్ప (70)కు భార్య, కుమారులు పదేళ్ల కిందట మృతి చెందారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాం చేశాడు. దీంతో ఒంటరిగా ఉన్న గుర్రప్పకు జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో రెండు రోజుల కిందట గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం గ్రామస్తులు గమనించి కుమార్తెలకు సమాచారం అందించారు. దీంతో కుమార్తె నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జగన్నాథగౌడుకు
దాతల చేయూత
● వైద్య ఖర్చులకు సాయం
పలమనేరు : బైరెడ్డిపల్లి మండలం రామనపల్లికి చెందిన జగన్నాథగౌడుకు మెరుగైన వైద్యం కోసం పలమనేరుకు చెందిన కనకదాస సేవా సమితి తరఫున కురుబ కులస్థులు రూ.16 వేల ఆర్థిక సాయాన్ని రోగి కుటుంబికులకు బుధవారం పట్టణంలో అందజేశారు. దీంతో సాయం చేసిన సుబ్రమణ్యం గౌడు, ఈశ్వర్, సోము, గోపాల్‌గౌడు, నారాయణ, దొర స్వామి తదితరులు బాధితుడి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. తన బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డబ్బులేదని తల్లి లక్షుమమ్మ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయ్యానా బిడ్డను కాపాడండి! అనే శీర్షికన గత శనివారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితం అయింది. దీనిపై స్పందించిన జిల్లా అధికారుల ఆదేశాలతో ఆ మండలం వైధ్యాధికారి విజయచంద్ర రోగిని చికిత్స కోసం చిత్తూరు ఆస్పత్రికి తరలించి హెచ్‌బీ లెవెల్స్‌ను మెరుగు చేశారు. మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం దాతలు ముందుకొచ్చి సాయం చేశారు. సాక్షి చూపిన సామాజిక బాధ్యతను స్థానికులు కొనియాడారు.
కంటైనర్‌లో మంటలు
గుడిపాల : కంటైనర్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం వేలూరు నుంచి ఢిల్లీకి కంటైనర్ స్క్రాబ్ (వేస్టేజ్)ను తీసుకెళ్తోంది. గుడిపాల మండలంలోని గొల్లమడుగు వద్ద ఉన్నట్టుండి లారీలో నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే కొంత మేర నష్టం వాటిల్లింది. వీటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బతుకు భారమై వృద్ధుడు..
Comments
Please login to add a commentAdd a comment