నాగమల్లేశ్వర స్వామి సేవలో పెద్దిరెడ్డి
సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు శివరాత్రి సందర్భంగా బుధవారం సందర్శించారు. ఆలయంలోని వినాయక, ఆంజనేయ, నాగమల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి మాజీ సభ్యుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, నిహాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఎంపీపీ ధనుంజయరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, నాయకులు మనోహర్ రెడ్డి, శివారెడ్డి, ఇందాద్, తేజరెడ్డి పాల్గొన్నారు.
రూ.1.05 కోట్ల
విద్యుత్ బిల్లుల చెల్లింపు
చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి జిల్లాలో శివరాత్రి ప్రభుత్వ సెలవు రోజు అయినప్పటికీ విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలను తెరిచారు. దీంతో మొత్తం 4,800 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించారని చిత్తూరు, తిరుపతి జిల్లాల ట్రాన్స్‌కో ఎస్‌ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు తెలిపారు. వీటి ద్వారా రూ.1.05 కోట్ల బిల్లుల చెల్లింపు అయిందని వివరించారు.
క్యాన్సర్ బాధితుడికి
పీఎం సహాయ నిధి
రొంపిచెర్ల : రొంపిచెర్ల మండలం మద్దిపట్లవారిపల్లెలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న దుర్గాప్రసాద్‌నాయుడుకు ప్రధానమంత్రి సహాయ నిధి కింద రూ.3 లక్షలను రాజంపేట ఎంపీ వెంకట మిధున్‌రెడ్డి మంజూరు చేయించారు. మద్దిపట్లవారిపల్లెకు చెందిన మునిరత్నం నాయుడు కుమారుడు దుర్గాప్రసాద్ నాయుడు(26) క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారని ఎంపీ దృష్టికి రెండు నెలల కిందట తీసుకెళ్లారు. దీంతో ఆర్థిక సాయం మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. దీంతో పీఎం సహాయ నిధి కింద రూ. 3 లక్షలను మంజూరు చేయించారు. అడిగిన వెంటనే పీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయించడంపై బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులా?
● తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు
● జీడీనెల్లూరు ఇన్‌చార్జి కృపాలక్ష్మి మండిపాటు
కార్వేటినగరం : కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తే మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి భయపడి పోతారనుకోవడం అవివేకమని గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఆ పార్టీ ఇన్‌చార్జి కళత్తూరు కృపాలక్ష్మి అన్నారు. బుధవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ఎల్లో మీడియాలో తన తండ్రి ఏదో స్కాంలో చిక్కుకుని జర్మనీకి వెళ్లిపోయినట్లు అసత్యాలను వండి వారుస్తున్నారని, అలాంటి వాటిపై క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు. మా నాన్న కుమార్తె ఇంటికి వెళ్లడంపై భయపడి పారిపోయాడని అబద్దాలు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. కళత్తూరు కుటుంబం కష్టపడి రాజకీయంగా ఎదిగిందని, స్కాంలు, అక్రమాలు చేసి రాలేదని హెచ్చరించారు. తన తండ్రిపై పనిగట్టుకుని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వారికి త్వరలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై తప్పుడు ప్రచారం చేసిన చానళ్లు ఆయనకు వెంటనే బహిరంగంగా క్షమాణ చెప్పాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
నిరుద్యోగులకు
‘జాబ్ ఎక్స్’ పోర్టల్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగులకు జాబ్ ఎక్స్ పోర్టల్ ఎంతో ఉపయోగకరమని జిల్లా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఆఫీసర్ గాంధీరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మిట్టూరులోని శ్రీ టెక్నాలజీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నేషనల్ స్కిల్ హబ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సూచనల మేరకు జిల్లా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ నిరుద్యోగ యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఎన్‌ఎస్‌డీసీ జాబ్ ఎక్స్ పోర్టల్‌తో కలిగే లాభాలను నిరుద్యోగులు తెలుసుకోవాలన్నారు. జిల్లాలోని నిరుద్యోగులు ఆ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల నిరుద్యోగుల అర్హతలకు తగ్గ ఉద్యోగాలను సాధించేందుకు వీలవుతుందన్నారు. పోర్టల్ లో అన్ని కంపెనీలు రిజిస్ట్రర్ కావడంతో నిరుద్యోగులకు సులువుగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఏవైనా సందేహాలకు 99592 36172 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు.
నాగమల్లేశ్వర స్వామి సేవలో పెద్దిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment