కమనీయం..
● తరలివచ్చిన భక్తులు ● ఒక్కటైన జంటలు
శ్రీకాళహస్తి: ఆదిదంపతుల కల్యాణం భక్తుల కోలాహలం మధ్య కమనీయంగా సాగింది. శనివారం తెల్లవారు జామున సుమారు 4.30గంటల సమయంలో జ్ఞానప్రసూనాంబదేవికి శ్రీకాళహస్తీశ్వరునిచే మాంగల్యధారణ జరిగింది. ఇదే శుభఘడియల్లో ఆదిదంపతుల సమక్షంలో నూత న జంటలు వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. అంతకుముందు శుక్రవారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించి వేదోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామివారిని గజ వాహనంపై, అమ్మవారిని సింహ వాహనంపై అదిష్టింపజేసి పెండ్లిమండపం వద్దకు వేంచేశారు. పెండ్లి మండపం వద్దకు మొదట పరమేశ్వరుడు చేరుకోగా.. మధ్యలో పార్వతీదేవి అలకబూనడంతో చండికేశ్వరుడు మధ్యవర్తిత్వం చేయడంతో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు సంతృప్తి చెంది పెండ్లి మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం వేదపండితులు ఆదిదంపతుల కల్యాణ ఘటన్ని పూర్తిచేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి దంపతులు, ఈవో బాపిరెడ్డి పాల్గొన్నారు.
ఒక్కటైన నూతన జంటలు
స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం సందర్భంగా నూతన జంటలు ఏకమయ్యాయి. నూతన వధూవరులకు ముక్కంటి ఆలయం తరఫున మంగళ సూత్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, దుస్తులు అందజేశారు. జ్ఞానప్రసూనాంబ దేవికి మాంగల్యధారణ చేసిన సమయంలోనే ఈ జంటలు కూడా మాంగల్యధారణ కార్యక్రమాన్ని పూర్తిచేసి ఒక్కటయ్యారు.
నేడు గిరిప్రదక్షిణ
శనివారం ఉదయం కల్యాణోత్సవం ముగిసింది. కల్యాణానికి వచ్చిన రుషులు, దేవతలను సాగనంపేందుకు శివయ్య ఆదివారం విల్లంబులు ధరించి వారివారి స్థావరాలకు చేర్చనున్నారు. దీన్నే రుషిరాత్రి అని కూడా అంటారు. గిరిప్రదక్షిణ తరువాత పట్టణానికి తిరిగి వచ్చే స్వామి, అమ్మవార్లకు భక్తులు వేలాది ఎదురుసేవ మండపం వద్దకు చేరుకుని స్వాగతం పలకడం ఆనవాయితీ. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రుద్రాక్ష చప్పరాలపై శివయ్య వైభవం
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షికోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి రుద్రాక్ష చప్పరాపై పురవీధుల్లో ఊరేగారు. ఆదిదంపతుల కల్యాణం ముగిసిన తర్వాత ఉత్సవమూర్తులను ఆలయానికి తీసుకెళ్లారు. ఉదయం 11గంటల సమయంలో వేదోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్లును రుద్రాక్ష చప్పరాలపై అధిష్టింపేజేసి పురవీధుల్లో ఊరేగించారు.
ఆగమోక్తం నటరాజస్వామి కల్యాణం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం రాత్రి సభాపతి కల్యాణం ఆగమోక్తంగా సాగింది. నటరాజ స్వామి, శివకామ సుందరి వివాహాన్ని పురోహితులు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం శివకామసుందరి సమేత నటరాజస్వామి పురవీధుల్లో ఊరేగారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం 8 గంటలకు : కై లాసగిరి ప్రదక్షిణ
వాహన సేవలు
ఉదయం: బనాత అంబారి వాహనసేవ
సాయంత్రం: అశ్వం – సింహ వాహన సేవ
ఉభయదాతలు: బియ్యపు కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం శ్రీవాణిరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి (శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు)
కమనీయం..
కమనీయం..
కమనీయం..
Comments
Please login to add a commentAdd a comment