
విలేకర్లతో మాట్లాడుతున్న లోవలక్ష్మి
కాజులూరు(కాకినాడ జిల్లా): తనపై భర్త, అతడి ప్రియురాలు హత్యాయత్నానికి పాల్పడ్డారని.. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పోలీసులు నెల రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని.. ఇకనైనా న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేయడం కలకలం రేపింది. మీడియాకు ఆమె మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు శివారు చాకిరేవు మెరకకు చెందిన అనసూరి లోవలక్ష్మికి పదేళ్ల కిందట కె.గంగవరం మండలం శివల గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది.
అయితే అతడు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై లోవలక్ష్మి నిలదీసింది. ఈ నేపథ్యంలో ఒక రోజు అర్ధరాత్రి భర్త, అతడి ప్రియురాలు కలిసి లోవలక్ష్మిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న లోవలక్ష్మి కాజులూరులోని పుట్టింటికి వచ్చేసింది. తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు న్యాయం చేయాలని గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్‌లో ఫిర్యాదు చేసింది.
వారు పట్టించుకోకపోవడంతో కాకినాడ జిల్లా ఎస్పీ రవీద్రనాథ్‌బాబును కలిసి పరిస్థితి వివరించింది. ఎస్పీ ఆదేశాల మేరకు గొల్లపాలెం పోలీసులు లోవలక్ష్మి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అయితే ఎటువంటి కేసూ నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో తనను నెల రోజులుగా అర్ధరాత్రి వరకూ ముద్దాయి మాదిరిగా పోలీస్ స్ట్షేన్ చుట్టూ తిప్పుతున్నారని, ఇకనైనా తనకు న్యాయం చేయకపోతే గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్ ఎదుట ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరో దారి లేదని లోవలక్ష్మి పేర్కొంది. ఆమె ఈవిధంగా మాట్లాడుతున్న వీడియో వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు మంగళవారం హడావుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
చదవండి: భార్య కళ్ల ముందే దారుణం.. నవ వరుడు..
కౌన్సెలింగ్ వల్లనే జాప్యం
ఇది భార్యాభర్తలకు సంబంధించిన కేసు. ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. అందువల్లనే కేసు నమోదు ఆలస్యమైంది. రెండుసార్లు కౌన్సెలింగ్ చేసినా వారు అంగీకరించలేదు. దీంతో మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం.
– ఎం.తులసీరామ్, ఎస్సై, గొల్లపాలెం
Comments
Please login to add a commentAdd a comment