ప్రియురాలి పెళ్లి చెడగొట్టాలని.. వరుడికి వాట్సాప్‌లో ఫొటోలు పంపిన ప్రియుడు, దాంతో | Bride commits suicide because of ex-boy friend sent photos to Fiance | Sakshi
Sakshi News home page

ప్రియురాలి పెళ్లి చెడగొట్టాలని.. వరుడికి వాట్సాప్‌లో ఫొటోలు పంపిన ప్రియుడు, దాంతో

Published Thu, Jun 9 2022 5:15 AM | Last Updated on Thu, Jun 9 2022 8:03 AM

Bride commits suicide because of ex-boy friend sent photos to Fiance - Sakshi

అలేఖ్య (ఫైల్‌)

ద్వారకాతిరుమల: ప్రియురాలి వివాహాన్ని చెడగొట్టేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్‌ మెసేజ్‌లను కాబోయే భర్తకు వాట్సాప్‌లో పంపాడు ఆమె ప్రియుడు. దీంతో మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకోగా బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. జాజులకుంటకు చెందిన బత్తుల అలేఖ్య (24) ఇంటి వద్ద ఉంటూ ప్రైవేట్‌గా చదువుతోంది.

రెండేళ్ల క్రితం ఆమె డీఎడ్‌ చదువుతుండగా నల్లజర్లకు చెందిన కారు డ్రైవర్‌ బైపే రవితేజతో ప్రేమలో పడింది. ఇంట్లో విషయం తెలవడంతో ఈనెల 1న కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన ముంగమూరి బుచ్చిబాబుతో ఆమె పెళ్లి కుదిర్చారు. ఈనెల 4న నిశ్చితార్థ వేడుక జరగ్గా, (ఈనెల 8న) బుధవారం భోజనాలు, 9న గురువారం వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు.

విషయం తెలిసిన ప్రియుడు రవితేజ ఆమె వివాహాన్ని చెడగొట్టాలని భావించి తనతో అలేఖ్య సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్‌ మెసేజ్‌లను అతడి స్నేహితుడు మరై సునీల్‌ సెల్‌ఫోన్‌ నుంచి పెళ్లికొడుకు ఫోన్‌కు వాట్సాప్‌ ద్వారా ఈనెల 7న పంపాడు. దీంతో మనస్తాపం చెందిన అలేఖ్య ఇంట్లోని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది.

కొద్దిసేపటికి కుటుంబసభ్యులు గుర్తించి తలుపులు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రవితేజ, సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్‌ చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement