సాక్షి, అమరావతి/హైదరాబాద్: జాతీయ బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని.. కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా ఆ నిధుల్ని అక్రమంగా తన వారి ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు గురువారం సోదాలు చేశాయి. ఏపీ, హైదరాబాద్, ముంబై సహా ఇతర ప్రాంతాల్లో ఆయన, ఆయన కంపెనీల డైరెక్టర్లకు చెందిన ఆస్తులపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. ఉదయం 6 గంటలకే మొదలైన ఈ సోదాల్లో ఏకంగా 11 బృందాలు పాల్గొన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు వడ్డీ కూడా చెల్లించకుండా బ్యాంకును మోసం చేయటం... తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవటం, 95 శాతం బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేయటం వంటి అంశాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు చేయటంతో సీబీఐ కేసు నమోదు చేసి సోదాలకు దిగింది. సంస్థకు చైర్మన్‌గా ఉన్న రఘురాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేసింది. దాడుల సందర్భంగా పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రల్లో సోదాలు..
సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్,శ్రీనగర్‌కాలనీ, చందానగర్, ముంబైలోని మధువన్, పశ్చిమ గోదావరిలోని కొవ్వూరు కలిపి ఏకకాలంలో 11 ప్రాంతాల్లోని ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కార్యాలయాలు, నివాసాలపై దాడులు జరిపింది. రఘురామకృష్ణరాజు కంపెనీలో అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న కొవ్వూరుకు చెందిన ఓ మహిళ ఇంట్లో కూడా సీబీఐ తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. భీమవరంలోని రఘురాజు నివాసానికి తాళం వేసి ఉండటంతో అధికారులు వెనుతిరిగారు.
అప్పు తీసుకుని... తన వారి ఖాతాలకు
కర్ణాటకలోని తమ పవర్ ప్రాజెక్టుకు రుణం కావాలని దరఖాస్తు చేసుకున్న ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్... పర్యావరణ అనుమతుల కారణంగా అక్కడ కాకుండా ప్లాంటును తమిళనాడులోని ట్యూటికోరిన్‌కు మార్చింది. బ్యాంకు ఆఫ్ బరోడా, దేనాబ్యాంకు, స్టేబ్‌బ్యాంక్ ఆఫ్‌ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్‌ఆఫ్ ఇండియా బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.826.17 కోట్ల మేర భారీ రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదు. దీనిపై కన్సార్షియం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా వివిధ దశల్లో రూ.826.17 కోట్లు తనకు సంబంధించిన వారికి వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా తరలించినట్లు వెల్లడైంది.
విదేశాలకు పారిపోతారేమో..!
అప్పులను రాబట్టుకునేందుకు బ్యాంకులన్నీ ఢిల్లీలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్, హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించాయి. నిందితులు అప్పులు ఎగ్గొట్టి న్యాయవిచారణ నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.
చీటింగ్ కేసు నమోదు
తీసుకున్న రుణాన్ని ఇతర మార్గాల్లో మళ్లించి ఉద్దేశపూర్వకంగా మోసగించారని పంజాబ్ నేషనల్ బ్యాంకు చీఫ్‌మేనేజర్ సౌరభ్ మల్హోత్రా, ఇతర బ్యాంకులు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాయి. నేరపూరిత కుట్ర, మోసం తదితర అభియోగాలతో ఐపీసీ 120బి, 420, పీసీ యాక్ట్ 13(2), రెడ్‌విత్ 13(1),(డి) సెక్షన్ల ప్రకారం రఘురామకృష్ణరాజుతోపాటు 9 మంది డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లతోపాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 22 పేజీల ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పలు సంచలన విషయాలను పొందుపరిచింది.
సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల జాబితా..
1. ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్, ఓల్డ్ బోయిన్‌పల్లి,
2. కనుమూరు రమాదేవి,
3. కనుమూరు రఘురామకృష్ణరాజు (చైర్మన్)
4. కోటగిరి ఇందిరా ప్రియదర్శిని,
5. గోపాలన్ మనోహరన్,
6. కొమరిగిరి సీతారామ్
7. భాగవతుల నారాయణ ప్రసాద్,
8. నంబూరి కుమారస్వామి
9. బోపన్న సౌజన్య
10. వడ్లమాని వీరవెంకట సత్యనారాయణరావు,
11. విస్ప్రగడ్డ పేర్రాజు
12. గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు
మీడియాపై ఎంపీ చిందులు..
ఒకవైపు ఉదయం నుంచి ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, కార్యాలయాలు, డైరెక్టర్ల కార్యాలయాలపై సీబీఐ దాడులు జరుగుతున్నా అవన్నీ అసత్యాలని ఎంపీ రఘురాజు ఖండిస్తూ వచ్చారు. అదంతా అసత్యమంటూ బుకాయించారు. సాయంత్రం సీబీఐ ఢిల్లీ విభాగం ప్రెస్‌నోట్ విడుదల చేసే వరకూ వాస్తవాలను కప్పిపుచ్చి తనను సంప్రదించేందుకు ప్రయత్నించిన మీడియాపై చిందులు తొక్కారు.
“రాజు’ అప్పు రూ.23,608 కోట్లు!
ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన పలు కంపెనీలకు దాదాపు రూ.23,608 కోట్ల మేర అప్పులున్నట్లు స్పష్టమవుతోంది. ఆయనకు హైదరాబాద్, చెన్నై ఆర్‌వోసీ పరిధిలో పలు కంపెనీలున్నాయి. కానీ వీటిల్లో ఏ కంపెనీకీ అప్‌డేటెడ్ ఫైలింగ్స్ లేవు. పలు కంపెనీలకు 2016 మార్చి నుంచి బ్యాలెన్స్ షీట్లను సమర్పించలేదు. ఇక ఇండ్–భారత్ ఎనర్జీ (ఉత్కల్), ఇండ్–భారత్ పవర్ (మద్రాస్), ఇండ్–భారత్ పవర్ జెన్‌కామ్ కంపెనీలు కార్పొరేట్ దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి.
ఇదీ... అప్పుల చిట్టా
- ఇండ్–భారత్ ఎనర్జీస్ లిమిటెడ్: రూ.3.25 కోట్లు
- ఇండ్–భారత్ ఎనర్జీ (ఉత్కల్): రూ.5,605.61 కోట్లు
- ఇండ్–భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్: రూ.2,655 కోట్లు
- ఇండ్–భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్: రూ.1,231.27 కోట్లు
- ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్: రూ.2,455.65 కోట్లు
- ఇండ్–భారత్ థర్మోటెక్ ప్రై .లి: రూ.2,968.91 కోట్లు
- చెన్నై ఆర్‌వోసీ పరిధిలోని ఇండ్–భారత్ పవర్ ఇన్‌ప్రా లిమిటెడ్: రూ.8,688.27 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment