ఢిల్లీలో అరెస్టయిన చైనీయులు
సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్ కేంద్రంగా సాగిన ‘న్యూ వరల్డ్’ స్కామ్ వెనుక చైనా జాతీయులే ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మందిని బాధితులుగా మారుస్తున్న ఈ వ్యవహారం గుట్టును ఢిల్లీ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారులు జనవరిలోనే రట్టు చేశారు. ఆ నెల 13న ఇద్దరు చైనాజాతీయులు సహా మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఈ స్కామ్‌లో బాధితులుగా మారిన 78 మంది బాధితులు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీలో జరిగిన అరెస్టుల విషయం తెలిసిన సిటీ అధికారులు అక్కడి పోలీసులను సంప్రదిస్తున్నారు. ‘నూ వరల్డ్’, ‘ఎన్‌డబ్ల్యూ రిచ్’ యాప్‌లు ప్లేస్టోర్స్‌లో లేవు. వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలంటూ వాట్సాప్ సందేశాల రూపంలో మాత్రమే వీటి లింకులు సర్క్యులేట్ అయ్యాయి. యూ ట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ల్లో సూచించిన అంశాలను లైక్, షేర్ చేస్తూ వాటి స్క్రీన్ షాట్స్‌ను ఈ యాప్స్‌లో పంపాల్సి ఉంటుంది.
డమ్మీ డైరెక్టర్లుగా..
టాస్క్‌గా పిలిచే ఈ ఒక్కో చర్యకు రూ.6 నుంచి రూ.50 వరకు ఇచ్చేలా ప్రచారం జరిగింది. ఆపై వివిధ స్కీముల పేరు చెప్పి అందినకాడికి దండుకుని మోసం చేశారు. ఇతర దేశంలో నివసిస్తున్న చైనా జాతీయుడు యాంగ్ కింగ్ జాంగ్ కుట్రతోనే ‘న్యూ వరల్డ్’ స్కామ్‌కు బీజం పడింది. తమ దేశానికే చెందిన చౌహోంగ్ డెంగ్ దావోయోంగ్, హూ జీయాషీలను భారత్‌కు పంపిన ఇతగాడు కొన్ని షెల్ కంపెనీలను స్థాపించేలా చేశాడు. చైనీయులే ప్రధాన డైరెక్టర్లుగా ఉన్న వీటిలో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని వివిధ ప్రైవేట్ సంస్థల్లో అకౌంటెంట్లు, ఆఫీస్ బాయ్స్, డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిని డమ్మీ డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థల చిరునామాలు సైతం అనుమానాస్పదంగానే ఉన్నాయి.
ఫోన్ల నుంచి ఫొటోలు,వీడియోలు అన్నీ మాయం..
ఈ సంస్థల ముసుగులో రేజర్ పే, జాయ్ రమ్మీ, చకు టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేమెంట్ గేట్‌వేలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆపై వాట్సాప్ లింకుల ద్వారా క్యూక్యూ బ్రౌజర్ యాప్‌ల కేటగిరీలోకి వచ్చే ‘న్యూ వరల్డ్’ను పంపారు. క్యూక్యూ ఫ్యామిలీకి చెందిన యాప్స్‌ను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గత ఏడాది జూన్‌లో నిషేధించింది. అయినా విదేశీ సర్వర్ల ద్వారా ఈ చైనీయులు వినియోగిస్తున్నారు. ‘న్యూ వరల్డ్’ యాప్ ద్వారా చైనీయులు నిషిద్ధ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు కూడా పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి ఫోన్ల నుంచి కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోల సహా అనేకం సంగ్రహించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా సామాజిక మాధ్యమాల్లో ‘లైక్, షేర్, ఫాలో’ చేస్తున్న అంశాలు ప్రముఖులవి అంటూ యాప్స్ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ ఎవరివనే దానిపై స్పష్టత ఉండట్లేదని తెలుస్తోంది.
క్రిప్టో కరెన్సీ రూపంలో..
ఈ యాప్స్‌ల లావాదేవీలకు సంబంధించిన మొత్తాలు క్రిప్టో కరెన్సీ రూపంలో దేశం దాటిపోయినట్లు ఢిల్లీ సైబర్ అధికారులు గుర్తించారు. కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌహోంగ్ డెంగ్ దావోయోంగ్, హూ జీయాషీలతో పాటు 10 మంది భారతీయుల్నీ అరెస్టు చేశారు. ఈ చైనీయులు వినియోగించిన 12 బ్యాంకు ఖాతాలు, క్రిప్టో కరెన్సీ వాలెట్స్ ఫ్రీజ్ చేశారు. ఈ స్కామ్ బారినపడిన ఢిల్లీవాసుల సంఖ్య 39,781గా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో అక్కడి పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో అరెస్టులు జనవరిలో జరగ్గా.. నగరంలో ఉన్న బాధితులు మాత్రం ఆదివారం వరకు ఆయా యాప్స్ వినియోగించారు. ఈ నేపథ్యంలోనే యాంగ్ కింగ్ జాంగ్ ఆదేశాలతో పనిచేసే వారు ఇంకా ఉండి ఉంటారని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment