
పొదల్లో పడివున్న దుస్తులు, అస్థిపంజరం
డీవీఆర్‌కండ్రిగ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ మహిళ పుర్రె కనిపించడం ఆదివారం కలకలం రేపింది.
నగరి(చిత్తూరు జిల్లా): డీవీఆర్‌కండ్రిగ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ మహిళ పుర్రె కనిపించడం ఆదివారం కలకలం రేపింది. ఎక్కువ రోజులు కావడంతో మహిళ ఎవరో గుర్తు తెలియని విధంగా ఉంది. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని జంతువులు లాక్కెళ్లి పీక్కుతిన్నట్లు పలు ప్రాంతాల్లో ఎముకలున్న ఆనవాళ్లు కనిపించింది. సీఐ మద్దయ్య ఆచారి తెలిపిన వివరాల మేరకు.. మేకల కాపరులు ఆదివారం సాయంత్రం మేకలు మేపుతూ అటవీ ప్రాంతంలో చెట్టుకు తల వేలాడుతూ ఉండటాన్ని గమనించి భయపడి పరుగులు తీశారు.
చదవండి: తల్లి మరణించిందని తెలియక.. రోజూ స్కూల్‌కు వెళ్లొచ్చిన బాలుడు
పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు చీరకు వేలాడుతున్న పుర్రె, సమీపంగా పడివున్న పచ్చ, నీలి రంగు కలిసిన చీర, డార్క్ గ్రీన్ కలర్ జాకెట్, పూసల దండ, ఎముకలను గమనించారు. వాటిని శవపరీక్షకు పంపారు. మృతి చెంది 50 నుంచి 60 రోజులు అయ్యుంటుందని వైద్యులు తేల్చారు. వయసు నిర్ధారించలేకపోతున్నారు. మహిళ ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా చంపి వేలాడదీశారా అనే కోణాల్లో విచారిస్తున్నారు. అటవీ ప్రాంతం కావడంతో గ్రామస్తులు ఎక్కువగా ఆ వైపు వెళ్లకపోవడం వల్ల 50 రోజుల వరకు విషయం బయటపడలేదు. విచారణ కొనసాగుతోంది.