కొలొరాడో: అమెరికాలో వారం రోజుల వ్యవధిలో మళ్లీ కాల్పులు జరగడం భయభ్రాంతులకు గురి చేసింది. కొలొరాడోలోని ఒక సూపర్ మార్కెట్‌లో సోమవారం ఒక దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి సహా 10 మంది మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా గాయపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బౌల్డర్ కౌంటీలోని కొలొరాడోలోని కింగ్ సూపర్స్ గ్రోసరీ మార్కెట్‌లో కాల్పులు జరుగుతున్నాయని సోమవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారి ఎరిక్ టాలీ (51) ఆధ్వర్యంలోని పోలీసు బృందం సూపర్ మార్కెట్‌కి తరలివెళ్లింది. సూపర్ మార్కెట్‌లోకి మొదట అడుగు పెట్టిన ఎరిక్ టాలీ ఆ కాల్పుల్లో మరణించారని బౌల్డర్ కౌంటీ చీఫ్ మారిస్ హెరాల్డ్ కన్నీళ్ల మధ్య చెప్పారు. గత 11 ఏళ్లుగా సేవలు అందిస్తున్న గొప్ప సాహసికుడైన అధికారిని కోల్పోయామని ఆమె అన్నారు.
అట్లాంటాలోని ఆసియా మసాజ్‌లపై జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందిన ఘటన జరిగి వారం రోజులైందో లేదో సూపర్ మార్కెట్‌లో కాల్పులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. బౌల్డర్ కౌంటీ చరిత్రలోనే ఇదో చీకటి రోజు అని ప్రత్యక్ష సాక్షులు కొందరు వ్యాఖ్యానించారు. సారా మూన్‌షాడో అనే మహిళ స్థానిక మీడియాతో మాట్లాడుతూ తాను, తన కుమారుడు స్ట్రా బెర్రీలు తీసుకుంటూ ఉండగా కాల్పుల శబ్ధం వినిపించిందని, వెంటనే తామిద్దరం ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశామని చెప్పారు. బయటకి వచ్చేసరికి పార్కింగ్ స్థలంలో ఒక మృతదేహాన్ని చూశామని, తాము ప్రాణాలతో బయటకు వస్తామని అనుకోలేదని అన్నారు. నిందితుడు కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment