బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్‌పై మరో కేసు నమోదు అయ్యింది. న్యాయవ్యవస్థ గురించి హానికరమైన ట్వీట్‌ను పోస్ట్ చేసినందుకు గాను నగరానికి చెందిన ఓ న్యాయవాది గురువారం ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను కోరాడు. ఈ విషయంపై ఇప్పటికే స్థానిక కోర్టు కంగనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇదే కాక మరో ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు కంగన, ఆమె సోదరి రంగోలి చండేలాకు సమన్లు జారీ చేశారు. బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులపై ప్రశ్నించడానికిగాను వచ్చే వారం హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. గత వారం కంగనపై మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ నమోదైన కేసుకు సంబంధించి బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందిస్తూ కంగన చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్నాయి.. కేసు నమోదు చేయాల్సిందిగా సదరు న్యాయవాది కోరాడు. దాంతో పోలీసులు కంగనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. న్యాయవ‍్యవస్థను కించపర్చడమే కాక పప్పు సేన అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై నవంబర్ 10 న అంధేరి కోర్టులో విచారించనున్నారు. (చదవండి: కంగనాకు అత్యాచార బెదిరింపు..)
గత వారం కంగనాతో పాటుగా ఆమె సోదరి రంగోలి చండేలా పైన కూడా దేశ ద్రోహం కేసు నమోదైంది. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కంగనా, రంగోలి ఇంటర్వ్యూలు, ట్వీట్లు దేశంలోని పలు సంఘాల మధ్య చిచ్చు పెడుతున్నాయని, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని సయ్యద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. న్యాయవ్యవస్థను కూడా ఎగతాళి చేస్తున్నారని ఆరోపించాడు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్లు 153 ఎ (శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295 ఎ (మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేసే హానికరమైన చర్యలు),ఆమె సోదరిపై 124 ఏ (దేశద్రోహం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన పోలీసులను కోరారు. సయ్యద్ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే దీనిపై స్పందించిన కంగనా మహారాష్ట్రలోని పప్పు సేనకు తనపై మక్కువ ఎక్కువై పోయిందంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అంత మిస్ అవ్వద్దు.. త్వరలోనే అక్కడకు వస్తాను అంటూ కంగన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment