
సాక్షి, హైదరాబాద్: డేటా చోరీ చేసేందుకు ఆన్‌లైన్ కేటుగాళ్లు నూతన పంధాను ఎంచుకున్నారు. ప్రముఖ సంస్థ పేరుతో ఫోన్ చేసి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే బహుమతులు గెలుచుకోవచ్చంటూ ప్రజలను బురడీ కొట్టిస్తున్నారు. ప్రేమికుల రోజును పురస్కరించుకొని తాము అడిగే సులభమైన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంఐ 11 టీ మొబైల్ ఫోన్ గెలుచుకోవాలంటూ గాలం వేసి, మొబైల్ ఫోన్లలో డేటాను తస్కరిస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఎవరు కూడా సైబర్ నేరగాళ్లు చెప్పే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్‌కు స్పందించి, వాళ్లు చెప్పిన విధంగా చేస్తే.. బ్యాంకు లావాదేవీలు మొత్తం సైబర్ నేరగాళ్లు చేతుల్లోకి వెళ్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రజలను బురడీ కొట్టించే క్రమంలో కేటుగాళ్లు లింకులు పంపి, వాట్సప్ గ్రూపులు ద్వారా 20 మంది స్నేహితులకు పంపాలని మెసేజ్‌లు పంపుతారని, ఇలాంటి వాటికి ప్రజలు స్పందించవద్దని సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో డేటా చోరీకి సంబంధించి అనేక కేసులు నమోదవుతున్నాయని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment