తుపాకీతో బెదిరించి.. కాళ్లు, చేతులు కట్టి! | Cyberabad Police Arrested A 11 Member Inter State Gang | Sakshi
Sakshi News home page

‘బండిల్స్‌’ దొంగలు దొరికారు

Published Thu, Jan 14 2021 10:32 AM | Last Updated on Thu, Jan 14 2021 10:36 AM

Cyberabad Police Arrested A 11 Member Inter State Gang - Sakshi

విద్యుత్‌ సామగ్రిని చూపిస్తున్న సజ్జనార్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులో నిర్మాణమవుతున్న గేటెడ్‌ కమ్యూనిటీల్లో చొరబడతారు.. సెక్యూరిటీ గార్డులను తుపాకీతో బెదిరిస్తారు.. వారి కాళ్లు, చేతులు తాడుతో కట్టేస్తారు.. ఆపై సీసీ కెమెరా డీవీఆర్‌లు ధ్వంసం చేసి స్టోర్‌ రూమ్‌ల్లోని ఎలక్ట్రిక్‌ సామగ్రి (వైర్‌ బండిల్స్, ఎంసీబీలు, ప్యానెల్‌ బోర్డులు)ని దొంగిలిస్తున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లకు చెందిన 9 మందితో పాటు ఇద్దరు రిసీవర్లను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్‌లోని పబ్లిక్‌ సేఫ్టీ– ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ అండ్‌ డాటా సెంటర్‌ ద్వారా సీసీ కెమెరాలతో నిందితుల బొలెరో వాహన నంబర్‌ను క్యాప్చర్‌ చేసి పోలీసులకు మార్గదర్శనం చేయడంతో దుండిగల్‌ టోల్‌గేట్‌ వద్ద కాపుకాసి మరీ పట్టుకున్నారు. రూ.55,10,000 విలువైన వైర్‌ బండిల్స్, ఎలక్ట్రిక్‌ వైర్‌ బండిల్స్, కాపర్‌ పైప్స్‌ అండ్‌ కేబుల్స్, ఎంసీబీ బాక్స్‌లు, బొలెరో వాహనం, ఒక పిస్టల్, 11 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సైబరాబాద్‌ క్రైమ్స్‌ ఇన్‌చార్జి డీసీపీ విజయ్‌కుమార్, శంషాబాద్, బాలానగర్‌ డీసీపీలు ప్రకాష్‌రెడ్డి, పద్మజారెడ్డి, ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ గోనె సందీప్‌లతో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. చదవండి: మొదటి రాత్రే ఉరివేసుకున్న వరుడు 

ఢిల్లీలో పరిచయం.. నగరంలో దోపిడీలు 
రాజస్థాన్‌ దౌలాపూర్‌ జిల్లాకు చెందిన ప్రదీప్‌ కుషావహ, కుల్దీప్, మాధవ్‌ సింగ్, ధర్మేందర్‌ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిహల్‌ సింగ్, శైలేందర్‌ సింగ్, సంజయ్, ధర్మేంద్ర కుమార్, సత్యబాన్‌ సింగ్‌లు వృత్తిరీత్యా ఎలక్ట్రిషియన్లు. ఢిల్లీలో పనిచేస్తున్న సమయంలో వీరు స్నేహితులయ్యారు. స్థిరాస్తి రంగం బాగుందని 2019లో హైదరాబాద్‌కు వచ్చారు. ముప్పా కంపెనీలో ఆరు నెలల పాటు రోజువారీ కూలీలుగా పనికి కుదిరారు. ప్రదీప్‌ కుషావాన్‌ మినహా మిగతావారంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ప్రదీప్‌ తాను పనిచేసే కంపెనీ నుంచి సెక్యూరిటీ కళ్లుగప్పి రోజుకో వైర్‌ బండిల్‌ తీసుకొచ్చి తక్కువ ధరకు విక్రయించేవాడు. అప్పటికే జల్సాలకు అలవాటుపడిన అతను తన గ్యాంగ్‌ను గతేడాది జూన్‌లో రప్పించాడు. 

వీరు పనిచేసిన డీఈ కంపెనీలోనే వైర్‌ బండిల్స్‌ చోరీ చేసి కొండాపూర్‌లో ఎలక్ట్రిక్‌ షాప్‌ నిర్వహిస్తున్న రాజస్థాన్‌కు చెందిన మనీశ్‌ కుమార్, స్క్రాప్‌ షాప్‌ నడుపుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన గోవుల విజయ్‌కుమార్‌కు విక్రయించారు.  వేలాది రూపాయల విలువచేసే వైర్‌ బండిల్‌ను కేవలం రూ.400కే అమ్మేవారు. ఈ సొమ్మును సమానంగా పంచుకుని  సొంతూళ్లకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ వీరిని ప్రదీప్‌ ఈ ఏడాది జనవరి 6న పిలిపించాడు.   

పక్కాగా రెక్కీ.. 
భవన నిర్మాణ పనులు జరుగుతున్న శంకర్‌పల్లి, మోకిల్లా, కొండకల్, నార్సింగి, మల్లంపేట, ఆర్‌సీపురం ప్రాంతాలకు ఉద్యోగం కావాలంటూ బొలేరో వాహనంలో వెళ్లేవారు. స్టోర్‌ రూమ్, వైర్‌ బండిల్స్‌ పరిశీలించేవారు. ఆ తర్వాత రాత్రి 11.30 నుంచి 3 గంటల మధ్యలో ఆయా సైట్లకు వెళ్లి వైర్ల బండిళ్లను దొంగిలించేవారు. వారం వ్యవధిలోనే శంకర్‌పల్లి, ఆర్‌సీపురం, దుండిగల్‌ వరుసగా చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్‌ విసిరారు.

జనవరి 9న అర్ధరాత్రి దాటాక మల్లంపేటలోని ప్రణీత్‌ ప్రణవ్‌ లీప్‌ విల్లాస్‌లో జరిగిన చోరీపై దుండిగల్‌లో కేసు ఫిర్యాదు రావడంతో బాలానగర్, శంషాబాద్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్లు రమణారెడ్డి, వెంకట్‌రెడ్డి, దుండిగల్, మేడ్చల్‌ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశం, ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో బృందాలు రంగంలోకి దిగాయి. చోరీ జరిగిన తీరును తెలుసుకున్న పోలీసులకు నిందితులు వినియోగించిన బొలెరో వాహన కదలికలు సీసీ కెమెరాలకు చిక్కాయి. వాహన నంబర్‌ ఆధారంగా నిఘా ముమ్మరం చేశారు. దుండిగల్‌ టోల్‌గేట్‌ ప్లాజా వద్ద బుధవారం ఉదయం వాహన తనిఖీలు చేస్తున్న ప్రత్యేక బృందాలకు బొలెరోలోని తుపాకీ, వైర్‌ బండిల్స్‌ దొరికాయి. ప్రదీప్‌ కుషావాహ, కుల్దీప్, శైలేంద్రసింగ్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన నిందితులను నార్సింగ్‌ ఠాణాలో ఇందిరానగర్‌లో పట్టుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బందిని సీపీ సజ్జనార్‌ నగదు రివార్డులను అందజేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement