♦ స్కీమ్–1 ప్రకారం రూ.300 పెట్టుబడి పెడితే 90 రోజుల్లో రూ.1350
♦ స్కీమ్–2 ప్రకారం రూ.3,000 ఇన్వెస్ట్ చేస్తే మూడు నెలల్లో రూ.13,500
♦ స్కీమ్–3లో రూ.15,000 పెడితే 90 రోజుల్లో రూ.67,500.. ఇలా ఆర్జించవచ్చంటూ సైకిల్ స్కీమ్ పేరుతో స్కామ్‌కు పాల్పడిన ‘షేర్డ్ బీకే’ వ్యవహారం వెనుకా చైనీయులే ఉన్నట్లు తేలింది. ఇప్పటికే ఈ తరహా కేసులో సైబరాబాద్ పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి చేతిలో నగరానికి చెందిన పది మంది దాదాపు రూ.10 లక్షల వరకు మోసపోయారని తేలింది. దీంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ఆ ముగ్గురినీ పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు. తదుపరి విచారణ కోసం కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
సాక్షి, హైదరాబాద్ : హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన ఉదయ్ ప్రతాప్, రాజేష్‌శర్మ, ఢిల్లీవాసి నితీష్ కుమార్ కోఠారి ఈ కేసుల్లో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. ఉదయ్ ప్రతాప్ ఐదేళ్ల క్రితం చైనాకు చెందిన టాప్–1 మోబీ టెక్నాలజీ అనే సంస్థలో పని చేశాడు. అప్పట్లో ఇతడికి చైనాకు చెందిన పెంగ్ గువాయి అలియాస్ జావీతో పరిచయమైంది. ఇతడితో పాటు నితీష్ కుమార్ కొఠారీ, రాజేష్ శర్మను ఆ చైనీయుడు మోబి సెంట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అధీకృత వ్యక్తులుగా చేశాడు.
తమ వద్ద ఎవరైనా పెట్టుబడి పెడితే ఆ మొత్తంతో సైకిల్ కొంటామని, ప్రతిరోజూ దాన్ని అద్దెకు తిప్పగా వచ్చిన మొత్తం ఇన్వెస్టర్‌కే ఇచ్చేస్తామంటూ వీళ్లు ప్రచారం చేసుకున్నారు. ఈ షేర్డ్ బైక్ యాప్‌లకు చెందిన లింకుల్ని వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేశారు. ముందుగా తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు చూపించి వారిని పూర్తిగా నమ్మించేవాళ్లు. ఆ మొత్తం కూడా నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసేవాళ్లు కాదు. కేవలం వారి పేర్లతో రూపొందించిన వర్చువల్ అకౌంట్స్‌లోనే జమ చేసినట్లు చూపించేవాళ్లు. నిర్ణీత సమయం తర్వాత ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు వచ్చి విత్‌డ్రా చేసుకునే అవకాశం వస్తుందని నమ్మించి భారీ మొత్తం డిపాజిట్ చేయించుకుని మోసం చేస్తూ పోయారు. దీని కోసం హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్, పుణేల్లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో ఏడు డమ్మీ కంపెనీలు రిజిస్టర్ చేశారు.
ఈ వ్యవహారంలో పెంగు గువాయితో పాటు మరో చైనీయుడు జాంగ్ హంగ్వాయి కీలకంగా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరి 20న పెంగు చైనాకు వెళ్లాడు. ఈ నేరగాళ్లు వేల మంది నుంచి రూ.కోట్లలో వసూలు చేశారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గతంలో ఉదయ్, నితీష్, రాజేష్‌లను అరెస్టు చేశారు. వీరి బారినపడిన వాళ్లు నగరంలోనూ ఉండటంతో ఇక్కడి పోలీసులూ దర్యాప్తు చేశారు. ఇన్‌స్పెక్టర్ బి.రమేష్ చేపట్టిన దర్యాప్తు నేపథ్యంలో తమకు వాంటెడ్‌గా ఉన్న వ్యక్తులు సైబరాబాద్ పోలీసులకు చిక్కినట్లు తేలింది. దీంతో నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ తీసుకున్న సిటీ పోలీసులు గురువారం ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.
ఇప్పటికే కలర్ ప్రిడెక్షన్ గేమ్, లోన్ యాప్స్ వ్యవహారాల్లో చైనీయులు పాత్ర ఉన్నట్లు స్పష్టమైంది. ఆయా కేసుల్లో ఐదుగురు చైనా జాతీయులు అరెస్టు కాగా.. పది మందికి పైగా పరారీలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా షేర్డ్ బీకే స్కామ్ వెనుకా చైనీయుల పాత్రపై స్పష్టత వచ్చింది. పోలీసులకు పూర్తి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంతో ఈ నేరగాళ్లు అటు గూగుల్ ప్లేస్టోర్ ఇటు యాపిల్ స్టోర్ ఇలా ఏ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించకుండా కేవలం లింకుల్ని సోషల్ మీడియాలో విస్తరిస్తూ తమ పని చేసుకుపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
చదవండి: చలసాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment