సాక్షి, హైదరాబాద్: ఫేక్ ఈ–మెయిల్ ఐడీతో హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారికి రూ.60 లక్షలు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. జూబ్లీహిల్స్‌కు చెందిన శేషగిరిరావు ట్రైక్యాడ్ డిజైన్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈయనకు తన క్లయింట్ అయిన అమెరికాకు చెందిన గ్లోబల్ జియో సప్లయిస్ సంస్థ నుంచి 3డీ సాఫ్ట్ మౌస్‌లు దిగుమతి చేసుకుంటుంటారు. ఇటీవల శేషగిరిరావుకు చెందిన అధికారిక ఈ–మెయిల్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో ఆయన అమెరికా సంస్థతో చేస్తున్న వ్యాపార లావాదేవీలు వెలుగుచూశాయి.
ఈ క్రమంలో అమెరికా సంస్థ అధికారిక ఈ–మెయిల్ ఐడీని పోలిన మరో ఐడీని క్రియేట్ చేసి దాన్నుంచి ఈ నెల 8న శేషగిరిరావుకు సైబర్‌గాళ్లు ఓ మెయిల్ పంపారు. అందులో తమకు చైనా సంస్థతోనూ లావాదేవీలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ దేశంపై అమెరికాలో ఆంక్షలు ఉన్నందున అక్కడి నుంచి తమకు అవసరమైన సరుకును మీరు దిగుమతి చేసుకుని, ఆ సరుకు భారత్ నుంచి వస్తున్నట్లు తమకు ఎగుమతి చేయాలని సూచించారు. అందులోనే చైనాకు చెందిన సంస్థ పేరుతో ఓ చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు పొందుపరిచారు. ఈ ఖాతాలోకి 79,800 డాలర్లు (రూ.60 లక్షలు) జమ చేస్తే మీకు చైనా నుంచి సరుకు వస్తుందంటూ నమ్మించారు.
సదరు అమెరికా సంస్థతో శేషగిరిరావుకు 13 ఏళ్లుగా వ్యాపార అనుబంధం ఉండటంతో సదరు ఖాతాలోకి ఈ నెల 18న ఆ మొత్తం జమ చేశాడు. ఇది జరిగిన రెండ్రోజులకు స్పేర్ పార్ట్స్ పంపడానికి మరికొంత మొత్తం చెల్లించాలని సైబర్ నేరగాళ్లు ఇంకో మెయిల్ పంపారు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి తనకు వచ్చిన మెయిల్ ఐడీని పరిశీలించగా మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో ఆయన బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇది నైజీరియన్ల పనిగా అనుమానిస్తున్నారు.
వ్యాపారికి రూ.60 లక్షల టోకరా
Published Thu, Aug 27 2020 5:57 AM | Last Updated on Thu, Aug 27 2020 6:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment