సాక్షి, హైదరాబాద్: భూ దస్తావేజుల నుంచి లభించిన వివరాల ఆధారంగా క్లోన్డ్ వేలిముద్రలు తయారు చేసి, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్)ను దుర్వినియోగం చేసి బ్యాంకు ఖాతాల నుంచి రూ.10 లక్షల మేర టోకరా వేసిన ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసు లు రట్టు చేశారు. తొమ్మిది మంది నిందితులున్న ఈ గ్యాంగ్‌లో ఆరుగురిని అరెస్టు చేశామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నామని సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ గజరావ్ భూపాల్ తెలిపారు. డీసీపీ డి.కవిత, ఏసీపీ ఆర్‌జీ శివమారుతీలతో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
జైలు నుంచి వచ్చి.. స్నేహితులకు చెప్పి
ఏపీలోని ప్రకాశం జిల్లా కంబంకు చెందిన ఎం. యువరాజు గతంలో వేలిముద్రల్ని క్లోన్ చేసి, వాటి ద్వారా ఏఈపీఎస్ విధానంలో బ్యాంకు ఖాతాల్లోని నగదు కాజేసి అరెస్టయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చాక ఈ స్కామ్ ఎలా చేయాలో తన స్నేహితుడైన కంబం వాసి రఫీకి చెప్పాడు. ఇతడు అసా ధారణ్, ఉదయ్‌కిరణ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఓ రూమ్‌లో ఉంటున్నాడు. వీరంతా కలిసి ఆ దందా చేద్దామని నిర్ణయించుకున్నారు. క్లోన్డ్ వేలిముద్రలు చేయడానికి అవసరమైన నమూనాలు, ఆధార్ నంబర్లు యువరాజే ఇచ్చాడు.
కంబం వాసి నరేంద్రకు అక్కడ మీ సేవ కేంద్రం నిర్వాహకుడితో స్నేహం ఉంది. తరచూ ఆ సేవా కేంద్రంలో కూర్చునే ఇతగాడు అక్కడి కంప్యూటర్‌లో ఉన్న దాదాపు 2,500 భూ రిజిస్ట్రేషన్ పత్రాల సాఫ్ట్‌కాపీలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసుకుని యువరాజు, రఫీకి ఇచ్చాడు. అసాధారణ్ త్రయం క్లోన్డ్ వేలిముద్రలు తయారీకి అవసరమైన మిషన్, ఇతర సామగ్రిని ఆన్‌లైన్‌లో ఖరీదు చేసింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కార్డు కాపీతోపాటు వేలిముద్రల్నీ డాక్యుమెంట్‌లో పొందుపరుస్తారు. వీరు తమ వద్ద ఉన్న 2,500 దస్తావేజుల సాఫ్ట్‌కాపీల నుంచి ఆధార్ నంబర్లు, వేలిముద్రల్ని సంగ్రహించి క్లోన్డ్ వేలి ముద్రలు తయారు చేశారు.
ఏఈపీఎస్ విధానంలో డబ్బు డ్రా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్ సంస్థల్లో ఏదో ఒక దాని నుంచి మర్చంట్ ఐడీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ అనుసంధానించి ఉన్న బ్యాంకు ఖాతాదారుడు పరిమిత మొత్తాలు ఈ మర్చంట్స్ వద్దే డ్రా చేసుకుంటారు. ఇలా డ్రా చేయడానికి బ్యాంకు ఖాతా నంబర్, ఓటీపీ తదితరాలు అవసరం లేదు.
నిరుద్యోగికి ఎర వేసి మర్చంట్ ఐడీ
వీరికి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి న కె.శ్రీను తారసపడ్డాడు. శ్రీను ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మర్చంట్ ఐడీ తీసుకునేలా అసాధారణ్ ప్రేరేపించాడు. శ్రీను తన పేరుపై ఐడీ, బయోమెట్రిక్ మిషన్ తీసుకుని అసాధారణ్‌కు ఇచ్చాడు. ఫినో పేమెంట్స్ వెబ్‌సైట్‌లో మర్చంట్ ఐడీని నమోదు చేసి, ఉపకరణం ద్వారా శ్రీను వేలిముద్రను తనిఖీ చేసి ఏఈపీఎస్‌లోకి ఎంటర్ అయ్యారు.
అక్కడ ఖాతాదారు ఆధార్ నంబర్‌ను పొందుపరిచి, వేలిముద్ర రీడింగ్ చేస్తే నిర్ణీత మొత్తం అతడి ఖాతా నుంచి మర్చంట్ ఖాతాలోకి వస్తుంది. మర్చంట్ తన వద్ద ఉన్న మొత్తం నుంచి ఖాతాదారుడికి తక్షణం చెల్లించేస్తాడు. ఫినో పేమెంట్స్ సైట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అసాధారణ్ త్రయం తమ వద్ద ఉన్న ఆధార్ నంబర్లు, క్లోన్డ్ వేలిముద్రలు వినియోగించి రూ.10 లక్షల్ని మర్చంట్ ఖాతాలుగా యాడ్ చేసిన తరుణ్, శివకృష్ణలకు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించింది. ఆపై ఏటీఎం కార్డులు వినియోగించి ఆ మొత్తాలు డ్రా చేసుకుని అంతా పంచుకుంటున్నారు.
సహకరించిన ఎథికల్ హ్యాకర్
అసాధారణ్ త్రయానికి ఓ దశలో సాంకేతిక సమస్యలు రావడంతో తమ స్నేహితుడైన ఎథికల్ çహ్యాకర్ మహ్మద్ ఇయాజ్ సాయం తీసుకుంది. ఆ సమస్యను పరిష్కరించి వీరికి సహకరించిన హ్యాకర్ ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బు డ్రా చేసుకుని వచ్చాడు. తాము శ్రీనుకు జారీ చేసిన మర్చంట్ ఐడీ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరుగుతున్నట్లు బ్యాంకుల నుంచి ఫినో పేమెంట్స్ సంస్థకు ఫిర్యాదులు అందాయి.
దీంతో ఈ సంస్థ సైబర్‌క్రైమ్ ఠాణాలో కేసు పెట్టింది. ఇన్‌స్పెక్టర్ ఎస్.సీతారాములు నేతృత్వంలో ఎస్సై వై.యాదగిరితో కూడిన బృందం దర్యాప్తు చేసింది. రఫీ, యువరాజు, తరుణ్ మినహా మిగిలిన ఆరుగురినీ అరెస్టు చేసింది. వీరి నుంచి ల్యాప్‌టాప్‌లు, ఇతర ఉపకరణాలు స్వా«దీనం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment