
న్యూఢిల్లీ: తాగిన మైకంలో కారు నడుపుతూ ఓ కాలేజీ విద్యార్థి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మరణించగా.. మరో వ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ఖల్సా కళాశాల సమీపంలో సోమవారం తెల్లవారుజూమున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. (ఎఫ్‌బీ అలర్ట్.. ప్రాణాలు కాపాడిన పోలీసులు)
ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ వజీర్ సింగ్(ఫైల్ ఫోటో)
వివరాలు.. మోడల్ సిటీ ప్రాంతానికి చెందిన తుషార్ గుప్తా(19) సింగపూర్‌లో చదవుకొంటున్నాడు. లాక్‌డౌన్ విధించడంతో ఇండియా వచ్చాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి స్నేహితులను కలిసి తిరిగి తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరాడు. వేగంగా కారును నడుపుతూ వచ్చి ‘ప్రకార్ పెట్రోలింగ్ వెహికల్’ని ఢీ కొట్టాడు. ప్రమాద ధాటికి పెట్రోలింగ్ వాహనం 10 అడుగుల మేర గాలిలో ఎగిరి కింద పడింది. అందులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వజీర్ సింగ్ అక్కడిక్కడే మరణించగా.. డ్రైవర్ అమిత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన నిందితుడు తుషార్‌పై ఐపీసీ 279, 337,304 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల ఢిల్లీ పోలీసులు వీధుల్లో నేరాలను అరికట్టడం కోసం రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేశారు. దీనికోసం ‘ప్రకార్ పెట్రోలింగ్ వెహికల్స్’తో నిఘా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment