సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు అంటున్నాయి.
ఇదే కేసుల ఇప్పటికే కవితను మూడుసార్లు సీబీఐ ప్రశ్నించింది. 2022లో ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ కేసులో నిందితురాలిగా సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి సీబీఐ నోటీసులిచ్చింది. దర్యాప్తు తర్వాత కవితను నిందితురాలిగా సీబీఐ పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. న్యాయమూర్తి ముందు కవిత పీఏ అశోక్ కౌశిక్ సంచలన విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందజేసినట్లు జడ్జి ముందు కౌశిక్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. కవితతో పాటు కౌశిక్‌ని కూడా నిందితుడిగా సీబీఐ పరిగణిస్తోంది.
సీబీఐ గతంలో ఇదే కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా పలుమార్లు కవితను ప్రశ్నించింది. చివరగా గత ఏడా ది జనవరి 16న విచారణకు రావాల్సిందిగా కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది. అయితే ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున విచారణకు హాజరుకాలేనంటూ ఆమె లేఖ రాశారు. ఆ తర్వాత ఈడీ నుంచి కవితకు ఏ విధమైన సమాధానం రాలేదు. సుప్రీంలో పిటిషన్‌పై ఈ నెల 28న విచారణ జరగనుంది.
సీబీఐ విచారణకు గైర్హాజరయ్యే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం. 26న విచారణకు వెళ్లొద్దని కవిత నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈడీ కేసులో 28న సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో గైర్హాజరయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment