లిక్కర్‌ స్కాంలోకి ఎలా వచ్చారు? | CBI Questioning To Kavitha In Delhi Liquor Scam | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కాంలోకి ఎలా వచ్చారు?

Published Sun, Apr 14 2024 5:34 AM | Last Updated on Sun, Apr 14 2024 5:44 AM

CBI Questioning To Kavitha In Delhi Liquor Scam - Sakshi

సీబీఐ కార్యాలయం వద్ద కవిత భర్త అనిల్‌

ఎవరి ప్రోద్బలంతో అడుగులు వేశారు

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన సీబీఐ

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పేరును ప్రస్తావిస్తూ ప్రశ్నలు

రెండున్నర గంటలపాటు విచారించిన అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఈ లిక్కర్‌ స్కాంలోకి ఎవరి ప్రోద్బలంతో వచ్చారనే ప్రశ్నతో సీబీఐ శనివారం విచారణను ప్రారంభించింది. ఈ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, ఇతర ఆప్‌ నేతలు, హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త అరుణ్‌ పిళ్లై, పారిశ్రామిక వేత్త శరత్‌చంద్రరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సమీర్‌ మహేంద్రు, విజయ్‌నాయర్, దినేష్‌ల పాత్రపై, వీరికి కవితతో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కవితను విచారించింది. రూ.100 కోట్ల నగదు చేతులు మారిందని, దీన్ని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎంత అందుకున్నారు అనే అంశాలను శుక్రవారం సీబీఐ కోర్టుకు తెలిపింది. వీటిపైనా శనివారం సీబీఐ కవితను ప్రశ్నించింది.

ఏ ఆఫర్‌ ఇస్తే ఒప్పుకున్నారు?
ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో మహిళా అధికారి సమ క్షంలో ముగ్గురు అధికారులు కవితను రెండున్నర గంట లపాటు విచారించారు. ఈ స్కాంలో మీరే కింగ్‌పిన్‌గా ఉన్నారని ఇప్పటికే పలువురు వాంగ్మూలం ఇచ్చిన విష యాన్ని కవితకు గుర్తు చేశారు. లిక్కర్‌ స్కాం విషయమై ముందుగా మిమ్మల్ని ఎవరు కలిశారు? ఏ ఆఫర్‌ ఇస్తే మీరు ఒప్పుకున్నారు? రూ.100 కోట్లకు సంబంధించి ఎవరెవర్ని ఏవిధంగా భాగస్వాముల్ని చేశారో చెప్పాలని ప్రశ్నించినట్లు సమాచారం. తాను ఎవర్నీ భాగస్వాముల్ని చేయలేదని, ఎవర్నీ భయపెట్టలేదని, ఎవరి నుంచి ముడుపులు అందుకోలేదని కవిత బదులిచ్చినట్లుగా తెలిసింది. లిక్కర్‌ స్కాంతో మీకు సంబంధం లేకపోతే వ్యాపారవేత్త శరత్‌చంద్రారెడ్డిని భయపెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించినట్లు సమాచారం. 

మొబైల్స్‌ను ఎందుకు ధ్వంసం చేశారు?
ఈ వ్యవహారంలో ఏ ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్న మీరు సమీర్‌ మహేంద్రుతో ఫేస్‌ టైమ్‌ ఆడియో కాల్‌ ద్వారా ఏం మాట్లాడారని సీబీఐ కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. అదేవిధంగా కేజ్రీవాల్‌తో ఫేస్‌ టైమ్‌ ఆడియో కాల్‌ ద్వారా మాట్లాడారా? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. ‘ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్లో అరుణ్‌ పిళ్‌లై, విజయ్‌నాయర్, దినేష్‌లను మీరు కలిసినట్లుగా దినేష్‌ ఆరోరా వాంగ్మూలంలో చెప్పాడు... ఆ సమయంలో మీరు వారిని కలిసి రూ.100 కోట్ల ముడుపుల విషయంపై చర్చించినట్లు తెలిసింది. కేజ్రీవాల్‌ నుంచి మీకు ఏదైనా సమాచారం వచ్చిందా? ఆప్‌ నేతలు ఎవరెవరు కేజ్రీవాల్‌ పేరును మీ వద్ద ప్రస్తావించారు? మీరు తప్పు చేయనట్లైతే మొబైల్‌ ఫోన్లను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి’ అంటూ సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం.

కవితతో.. భర్త, న్యాయవాది భేటీ
సీబీఐ విచారణ ముగిసిన తర్వాత కవితను సీబీఐ కార్యాలయంలో భర్త అనిల్, న్యాయవాది మోహిత్‌రావు, పీఏ శరత్‌ కలిశారు. సీబీఐ విచారించిన విషయాలపై అనిల్, మోహిత్‌రావు సుదీర్ఘంగా చర్చించారు. కవిత క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్న అనిల్‌.. ఆమెకు ధైర్యం చెప్పారు. న్యాయం దిశగా అడుగులు వేద్దామని భరోసా ఇచ్చారు. కవితను సోమవారం సీబీఐ కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో వాదించాల్సిన విషయాలపై మోహిత్‌రావు కవితతో చర్చించినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement