తెనాలిరూరల్ : వ్యక్తి వేధింపులు తాళలేని ఓ మహిళ దిశ యాప్ ఎస్‌ఓఎస్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. ఆ వ్యక్తిని దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలిలో నివాసముండే మహిళ తన కుమార్తె పెళ్లి ఖర్చుల నిమిత్తం శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి రూ.రెండు లక్షలు అప్పుగా తీసుకుంది. కొన్ని నెలల తర్వాత వడ్డీతో సహా చెల్లించింది. అయినా శ్రీనివాసరావు ఆ మహిళకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు.
గతంలో అప్పు కోసం తన ఆఫీస్‌కు వచ్చినప్పటి ఫొటోలు, కాల్ రికార్డ్‌లున్నాయని బెదిరించేవాడు. బాధిత మహిళ తన భర్తకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా శ్రీనివాసరావు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం బాధిత మహిళకు, ఆమె భర్తకు మార్ఫింగ్ ఫొటోలు పంపి వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు దిశ ఎస్‌ఓఎస్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.
తెనాలి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బాధిత మహిళ ఇంటికి దిశ పోలీసులు ఆరు నిమిషాల్లో చేరుకున్నారు. ఆమెకు శ్రీనివాసరావు పంపించిన అసభ్యకర సందేశాలను, అప్పు చెల్లించినట్టు ఉన్న వివరాలను పోలీసులు సేకరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావుపై ఐపీసీ సెక్షన్ 354 ఈ, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment