దివ్య తేజస్విని మృతదేహాన్ని తీసుకెళ్తున్న బంధువులు
సాక్షి, అమరావతి : ఇద్దరం ఇష్టపడ్డాం.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తు కలిసి బతకలేకపోయాం.. అందుకే ఆమెను చంపి నేనూ చనిపోవడానికి సిద్ధపడ్డా’నంటూ నిందితుడు నాగేంద్రబాబు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. విజయవాడ నగరంలోని క్రీస్తురాజుపురంలో గురువారం ప్రేమోన్మాదంతో నాగేంద్రబాబు తన ప్రియురాలి దివ్య తేజస్వినిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు పోలీసులకు, మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. పెళ్లి చేసుకున్న తాము కలిసి బతకలేక పోతున్నామని.. ఇక కలిసే పరిస్థితి లేకపోతే ఇద్దరం ఇష్ట ప్రకారమే చనిపోదామన్న దివ్య సలహా మేరకు ఆమె ఇచ్చిన కత్తితోనే హత్య చేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని నాగేంద్రబాబు పోలీసులకు వెల్లడించాడు. దివ్య హత్యకు ఆమె తల్లిదండ్రులే కారణమని ఆరోపించాడు. చదవండి: దివ్య తేజశ్విని కేసు దర్యాప్తు ‘దిశ’ పోలీసులకు
మంగళగిరిలో మంగళసూత్రం కట్టా..
దివ్యతో తనకు పదమూడేళ్ల నుంచి పరిచయముందని, అది ప్రేమగా మారి, ఇద్దరి ఇష్ట ప్రకారమే గత ఏడాది మంగళగిరిలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నట్టు నాగేంద్రబాబు స్పష్టం చేశాడు. ఈ విషయం ఇరువురి పెద్దలకు తెలుసని, ఆమె తల్లిదండ్రులు తామిద్దరినీ వేరు చేశారని చెప్పాడు. దివ్య లేకుండా తాను ఉండలేకపోతున్నానని, కాపురానికి తనతో తీసుకువెళతానని పలుమార్లు దివ్య తండ్రి జోసెఫ్‌తో గొడవ పడినట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా అసలు నాగేంద్రబాబు ఎవరో తమకు తెలియదని, ఎప్పుడూ చూడలేదని దివ్య తల్లిదండ్రులు చెబుతున్నారు. నిష్కారణంగా తమ కూతుర్ని పొట్టనబెట్టుకున్నాడని ఆవేదన చెందుతున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న తమ కూతురు ఓ ప్రేమోన్మాది చేతిలో బలైపోయిందంటూ దివ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎంతో గారాబంగా పెంచుకున్న తమ కూతుర్ని పొట్టనబెట్టుకున్నాడని రోదిస్తున్నారు. విషణ్ణ వదనాలతో శుక్రవారం దివ్యకు అంత్యక్రియలు జరిపించారు. చదవండి: దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్
‘దిశ’ ప్రత్యేకాధికారుల పరామర్శ
హత్యకు గురైన దివ్య తేజస్విని కుటుంబాన్ని ‘దిశ’ ప్రత్యేకాధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్‌లు శుక్రవారం పరామర్శించారు. దిశ చట్టం ప్రకారం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దివ్య కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment