
హతుడు కంచభట్ల నాగసాయి (ఫైల్)
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: ఒక పురోహితుడిని అతడి సహచరుడే హతమార్చిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేరం బయట పడకుండా నిందితుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. రాజమహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన కంచభట్ల నాగసాయి అలియాస్ వెంకటేష్ (24), నాగపవన్ (19) స్నేహితులు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. పౌరోహిత్యం చేసుకుంటూ కోలమూరు గ్రామ పంచాయతీ పరిధి బొమ్మన కాలనీలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరి దగ్గరకు తరచూ చరణ్, నందా, షణ్ముఖ్ కార్తీక్ అనే స్నేహితులు వస్తుంటారు.
ఖర్చులు ఎక్కువ చేస్తున్నావంటూ నాగపవన్‌ను ఇటీవల నాగసాయి మందలిస్తున్నాడు. కొన్నిసార్లు కొడుతున్నాడు. గత నెల 24న ఖర్చుల విషయంపై వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన నాగపవన్.. చాకుతో నాగసాయిని మెడ మీద, పొట్టలో పొడిచాడు. తీవ్ర గాయాలతో నాగసాయి అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మిత్రుడి మృతదేహాన్ని వదిలేసి నాగపవన్ వెళ్లిపోయాడు. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చి మృతదేహాన్ని ఇంట్లోనే కాల్చేందుకు ప్రయత్నించాడు. పూర్తిగా కాలకపోవడంతో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. తిరిగి శుక్రవారం (ఈ నెల 3) సాయంత్రం మరో స్నేహితుడితో కలిసి ఇంటికి చేరుకున్నాడు.
చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..)
మృతదేహంపై దుప్పట్లు వేసి కాల్చేందుకు వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో దుర్వాసన రావడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో నాగపవన్ మృతదేహాన్ని బాత్‌రూములో పడేసి, పంది చనిపోయినట్టుందని చెప్పి ఆదరాబాదరాగా జారుకున్నారు. వారి తీరుపై అనుమానం వచ్చిన స్థానికులు రాజానగరం పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం అర్ధరాత్రి రాజానగరం ఇన్‌స్పెక్టర్ ఎంవీ సుభాష్, ఎస్సై వై.సుధాకర్‌లు ఆ ఇంటిని పరిశీలించారు.
సగం కాలిన శవం బాత్‌రూములో పడి ఉండటాన్ని గుర్తించారు. శనివారం ఉదయం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ వచ్చి స్థానికులను ఆరా తీశారు. తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ యువకులు దారితప్పినట్లు గుర్తించారు. వ్యసనాలకు బానిసైనట్లు భావిస్తున్నారు. నాగసాయి కొంతకాలం యాక్టింగ్‌పై మక్కువతో మైసూరు తదితర ప్రాంతాలకు వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. నిందితుడు నాగపవన్‌తో పాటు ఉన్న స్నేహితులెవరనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రవికుమార్ తెలిపారు.
చదవండి: (కన్నీళ్లు మిగిల్చిన వేడినీళ్లు)
Comments
Please login to add a commentAdd a comment