ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం  | Engineering Student Burnt To Death In Odisha | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం 

Published Thu, Jan 28 2021 9:31 AM | Last Updated on Thu, Jan 28 2021 1:13 PM

Engineering Student Burnt To Death In Odisha - Sakshi

భువనేశ్వర్‌: ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనమయ్యాడు. పలు అనుమానాలకు దారితీసిన ఈ దారుణం రణస్థలం మండలంలో సంచలమైంది. రణస్థలం పంచాయతీ పరిధి సీతంపేట గ్రామ సమీప తోటల్లో విద్యార్థి సజీవదహనమై కనిపించిన ఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. జె.ఆర్‌.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 5.30 గంటల సమయంలో పొలాలకు వెళ్లిన రైతులకు దుర్గారావు అనే వ్యక్తికి చెందిన పొలంలోని ధాన్యం బస్తాలు కాలిపోయి పొగలు రావడాన్ని గమనించారు. దీంతో వారంతా పక్కనే ఉన్న తోటపల్లి కాలువలోని నీటిని బకెట్లతో తీసుకొచ్చి కాలిపోతున్న ధాన్యం బస్తాలపై జల్లుతుండగా...పక్కనే కాలిపోయిన శవం కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో విషయాన్ని రణస్థలంలోని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. వారు జె.ఆర్‌.పురం పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన సీఐ వి.చంద్రశేఖర్‌ సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్లూస్‌టీంకు తెలియజేయడంతో వారు వచ్చి కాలిపోయిన మృతదేహాన్ని, సమీపంలో పడిఉన్న ఏటీఎం కార్డు, పర్సులోని కళాశాల ఫీజు రశీదును గుర్తించారు. వాటి ఆధారంగా సజీవ దహనమైన యువకుడు మువ్వల నగేష్‌(18)గా తెలుసుకున్నారు. ఇతను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శివాని కళాశాలలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడని, స్వగ్రామం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవుగా తేలిందని పోలీసులు తెలిపారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా మృతుడు సోదరుడు మేఘనాథ్‌ (ఆర్‌ఎంపీ వైద్యుడు) సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. సజీవదహనమైన తమ్ముడు నగేష్‌ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.   

మృతుని సోదరుడు ఏం చెప్పాడంటే.. 
ఈ నెల 7వ తేదీన శివాని ఇంజినీరింగ్‌ కళాశాలలో జాయినయ్యాడని, తరువాత మధ్యలో రెండు సార్లు ఇంటికి వచ్చాడని నగేష్‌ సోదరుడు మేఘనాథ్‌ చెప్పారు. ఈ నెల 25న ఉదయం తొమ్మిది గంటలకు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వచ్చేశాడన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కాలేజీలో సెల్‌ఫోన్‌ విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు స్నేహితుల ద్వారా తెలిసిందన్నారు. బుధవారం ఉదయం పోలీసుల నుంచి ఫోన్‌ రావడంతో తమ్ముడు చనిపోయిన విషయం తెలిసిందని రోదిస్తూ చెప్పారు. నగేష్‌ తల్లిదండ్రులు సుందరి, గోపాల్‌ మత్స్య వేటే వృత్తిగా బతుకుతున్నారు. కాగా విద్యార్థి సజీవ దహనంపై పోలీసులు, క్లూస్‌ టీం అన్ని కోణాల్లో లోతుగా విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చంద్రశేఖర్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement