లక్నో : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శనివారం కాశ్మీర్ సింగ్ (75) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఘాజిపూర్ సరిహద్దు వద్ద గత కొన్ని రోజులుగా రైతులు నిరసనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కాశ్మీర్ సింగ్ అనే రైతు టాయిలెట్ గది లోపల ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతును ఉత్తర ప్రదేశ్ రాంపూర్ నివాసిగా గుర్తించారు. రైతుల పట్ల కేంద్రం చాలా దారుణంగా వ్యవహరించిందని కాశ్మీర్ సింగ్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. రైతు నిరసనలు చేస్తున్న స్థలంలోనే తనకు దహన సంస్కారాలు నిర్వహించాలని నోట్‌లో తెలిపాడు. గతంలోనూ కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో హర్యానాకు చెందిన ఓ పూజారి ఢిల్లీ సింఘు సరిహద్దు సమీపంలో ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం కలిగించింది. (కేంద్ర చట్టాలపై కేరళ అసెంబ్లీ తీర్మానం )
కాగా వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దు సహా నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో కొంత పురోగతి చోటు చేసుకుంది. రైతుల ప్రధానమైన 4 డిమాండ్లలో.. సాగు చట్టాల రద్దుకు విధివిధానాలు రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడమనే రెండు డిమాండ్ల అమలుపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. రైతులపై విద్యుత్ బిల్లుల భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌కు, అలాగే, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించే ప్రతిపాదనను విరమించుకోవాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.(సూసైడ్ నోట్ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య )
Comments
Please login to add a commentAdd a comment