యాదగిరిగుట్ట: కూతురితో సహా ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదగిరిగుట్టలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లా, బోక్తాపూర్‌కు చెందిన చెరుకూరి సురేష్ (40) హైదరాబాద్‌కు చెందిన నాగలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సురేష్ హైదరాబాద్, చందానగర్‌లోని బీఎస్ ఎన్‌ఎల్‌లో సబ్ డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా డు. వీరికి శ్రేష్ఠ(6) కూతురు ఉంది. గత కొంత కాలంగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సురేష్ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా సర్దిచెప్పడంతో వివాదాలు సద్దుమణిగాయి. ఇటీవల మళ్లీ గొడవలు ఎక్కువ కావడంతో మనస్తాపానికిలోనైన సురేష్, తన కుమార్తెతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం కుమార్తెతో సహా యాదాద్రికి వచ్చాడు.
స్వామిని దర్శించుకుని..
స్థానిక మయూరి గ్రాండ్ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్న సురేష్ సాయంత్రం కూతురితో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని, అనంతరం కొండ కిందకు వచ్చి కుమార్తెకు ఇష్టమైన ఆహార పదార్థాలు కొనిచ్చాడు. సాయంత్రం 7గంటల ప్రాంతంలో తిరిగి హోటల్‌కు చేరుకున్నాడు. రాత్రి 12.30గంటల ప్రాంతంలో కుమార్తెను తీసుకొని హోటల్ పై అంతస్తులోకి వెళ్లి, తొలుత కూతురు శేష్ఠను కిదకు తోసేశాడు. అనంతరం తాను కూడా కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెద్ద శబ్దం రాగానే హోటల్ నిర్వాహకులు వెళ్లి చూడగా రోడ్డుపై శ్రేష్ఠ, టెర్రస్‌పై సురేష్ మృతదేహాలు పడి ఉన్నాయి. దీంతో హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులు, భార్యకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ప్రసాద్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జానకిరెడ్డి తెలిపారు.
గదిలో సూసైడ్ నోట్ లభ్యం
సురేష్ ఆత్మహత్య చేసుకునే ముందే తాను బస చేసిన గదిలో సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే తాను కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నానని.. నేను చని పోతే నా కూతురును నా భార్య సరిగా చూస్తుందో లేదో అనే భావనతో ఇద్దరం చనిపోతున్నామని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు.
ఫ్రెండ్స్ కాలనీలో విషాద చాయలు
కుమార్తెతో సహా సురేష్ ఆత్మహత్యకు పాల్పడిన వార్త తెలియడంతో ఫ్రెండ్స్ కాలనీలో విషాదం నెలకొంది. సురేష్ సాయిబాలాజీ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఎస్‌డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య నాగలక్ష్మి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలోనే పని చేసేది. విదేశాలకు వెళ్లే నిమిత్తం కొన్నాళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసింది.
ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సురేష్ కుమార్తెతో సహా యాదగిరిగుట్టకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురేష్‌కుమార్ అందరితో కలవిడిగా ఉండేవాడని, ఉద్యోగ విషయంలో చురుగ్గా పనిచేసేవాడని, అవార్డులను కూడా అందుకున్నట్లు అతడి స్నేహితులు తెలిపారు. మృతదేహాలను బీరంగూడలో ఉంటున్న మృతుడు సురేష్‌కుమార్ తండ్రి ప్రసాద్‌రావు నివాసానికి తీసుకెళ్లారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
(చదవండి: డ్రగ్ వరల్డ్ @ ఆన్‌లైన్!)
Comments
Please login to add a commentAdd a comment