
న్యూఢిల్లీ: నైరుతి ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ద్వారక ప్రాంతంలోని సెక్టార్-8లోని హోటల్ కృష్ణలో అగ్నిప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్‌గా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల ప్రకారం, ఈరోజు (ఆదివారం) ఉదయం 8 గంటల ప్రాంతంలో హోటల్ నుంచి మంటలు చెలరేగాయి. కాసేపటికే ఆ ప్రదేశమంతా దట్టంగా పొగలు వ్యాపించాయి.
దీంతో స్థానికులు పోలీసులకు, ఫైరింజన్ వారికి సమాచారం అందించారు. కాగా, రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 8 ఫైరింజన్‌లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, మృతి చెందిన వారిలో ఒకరిని దీపక్‌గా గుర్తించారు. గాయపడినవారిలో ఒక మహిళ ఉన్నట్లు గుర్తించారు. వీరిని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఆసుపత్రికి తరలించారు. ఈ భవనం.. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన సిద్దార్థ్, కరుణకు చెందినదిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.