కూకట్‌పల్లి: సుమారు రెండున్నర దశాబ్దాల పాటు బిగ్ స్క్రీన్‌పై సినీ వినోదాన్ని అందించిన కూకట్‌పల్లి శివపార్వతి థియేటర్ అగ్నికి ఆహుతైంది. నామరూపాల్లేకుండా థియేటర్ సర్వం బుగ్గిపాలుకావడం సినీ ప్రేక్షకులను కలచివేసింది. ఆదివారం రాత్రి సెకండ్ షో ముగిసిన తరువాత రోజుమాదిరిగా థియేటర్‌ను మూసివేయగా, తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అకస్మాత్తుగా థియేటర్‌లో మంటలు వ్యాప్తి చెంది క్షణాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. థియేటర్ రూఫ్ సైతం మంటలకు కాలి కుప్పకూలింది. సినిమా ప్రదర్శన ముగిశాక ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ఏరియాలో మొదటిది..
కేపీహెచ్‌బీకాలనీ ఎదురుగా భాగ్యనగ్‌కాలనీలో కూకట్‌పల్లి ప్రాంతంలోనే మొదటిసారిగా దాదాపు 25 ఏళ్లుగా శ్రీనివాస్‌బాబు అనే వ్యక్తి శివపార్వతి థియేటర్‌ను ప్రారంభించారు. ఆ పక్కనే అర్జున్, వెనుక విశ్వనాథ్ థియేటర్లు కూడా ఉన్నాయి. థియేటర్లు మూడు పక్కపక్కనే ఉండడంతో ఎప్పుడూ సినీ ప్రియులతో ఆ ప్రాంతం సందడిగా ఉంటుంది. ఆదివారం రాత్రి శ్యామ్‌సింగరాయ్ సినిమా సెకండ్ షో ముగియగానే ఒంటి గంట సమయంలో సిబ్బంది థియేటర్‌లోని అన్ని లైట్లను, డోర్లను మూసివేసి తాళాలు వేశారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో థియేటర్ లోపల మంటలు వ్యాపించాయి.
మంటలు కొద్దికొద్దిగా వ్యాపిస్తూ రూఫ్ వరకు వచ్చేవరకు వాచ్‌మెన్ గమనించలేకపోయారు. గంట తరువాత 4.35 గంటలకు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. అంటే ఈ గంటలోనే థియేటర్‌ను పూర్తిస్థాయిలో మంటలు చుట్టుముట్టాయి. నిమిషాల వ్యవధిలోనే కూకట్‌పల్లి, సనత్‌నగర్, మాదాపూర్ ఫైర్‌స్టేషన్ల నుంచి ఫైరింజన్లు అక్కడికి చేరుకుని 5.30 గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో బిగ్ స్క్రీన్, ప్రొజెక్టర్, సీట్లు, స్క్రీన్ సౌండ్ సిస్టమ్, థియేటర్ రూఫ్ పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రెండు కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమికంగా తేల్చారు. కేపీహెచ్‌బీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment