అన్నప్రాశనకు వెళ్తూ అనంత లోకాలకు | Five Including 6 Month Old Baby Of Andhra Family Passed Away In Road Mishap | Sakshi
Sakshi News home page

అన్నప్రాశనకు వెళ్తూ అనంత లోకాలకు

Published Mon, Mar 14 2022 3:16 AM | Last Updated on Mon, Mar 14 2022 3:16 AM

Five Including 6 Month Old Baby Of Andhra Family Passed Away In Road Mishap - Sakshi

కృష్ణా జిల్లా గౌరవరం వద్దప్రమాదంలో మృతిచెందిన తల్లీబిడ్డ శాంతి, గాబ్రియేల్‌..  భర్తతో శాంతి, కుమార్తె గాబ్రియేల్‌(ఫైల్‌)..  ప్రమాద దృశ్యం

వత్సవాయి/జగ్గయ్యపేట/చందానగర్‌ (హైదరాబాద్‌):  చిన్నారి అన్నప్రాశన కోసమని సంతోషంగా బయలుదేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. కొద్దిగంటల్లో గమ్యస్థానం చేరుకుంటారనగా డ్రైవర్‌ నిద్రమత్తు రూపంలో ఐదుగురిని కబళించింది. ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం గౌరవరం సమీపంలో అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుకావడం, ఇందులో అన్నప్రాశన చేసుకోవాల్సిన చిన్నారి కూడా ఉండటం విషాదాన్ని నింపింది.

ఆ సంతోషమూ ఆవిరి 
ప్రమాదంలో మరణించిన ఇందిర 6 నెలల గర్భిణి. వివాహమై మూడేళ్లు గడిచాక ఇటీవలే ఆమె గర్భం దాల్చింది. కుటుంబమంతా ఎంతో సంతోషించింది. కానీ ఇంతలోనే ఆమెనూ విధి బలితీసుకుంది. ప్రమాదంపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ముందురోజు రాత్రే తమతో మాట్లాడిన వారంతా తెల్లవారేసరికి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నామని కుటుంబరావు బంధువు లు, ఇరుగుపొరుగు బాధను వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మృత్యువాత పడటంతో హుడా కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నిద్రమత్తుతో ప్రమాదం..
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం జాలిపూడికి చెందిన కూరపాటి కుటుంబరావు (60) కుటుంబం హైదరాబాద్‌లోని చందానగర్‌ హుడా కాలనీలో స్థిరపడింది. ఆయన భార్య మరియమ్మ (50), ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన చిన్నకుమార్తె శాంతి (28)ని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బోనాల 
రవీంద్రకి ఇచ్చి వివాహం చేశారు.

ఇటీవలే రవీంద్ర–శాంతి దంపతులకు కుమార్తె  గాబ్రియేల్‌ జన్మించింది. ఆ చిన్నారికి 6 నెలలు నిండ టంతో జంగారెడ్డిగూడెంలో అన్నప్రాశన జరపాలని నిర్ణయించారు. కుటుంబరావు, మరియమ్మ, వారి కుమారుడు జోషి, కోడలు ఇందిర (30), కుమార్తె శాంతి, మనవరాలు అడోనా గాబ్రియేల్‌తో కలిసి శనివారం రాత్రి 11 గంటల సమయంలో జాలిపూడికి బయలుదేరారు.

ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో.. ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం గౌరవరం సమీపంలోకి వచ్చేసరికి కారు నడుపుతున్న జోషి నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో కారు అదుపు తప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరియమ్మ, కుటుంబరావు, శాంతి అక్కడికక్కడే చనిపోయారు. జోషి, ఇందిర, చిన్నారి అడోన గాబ్రియేల్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఇందిర, చిన్నారి కూడా మృతి చెందారు. జోషిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement