పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లు
మిర్యాలగూడ టౌన్: ఓ రాష్ట్రంలో కార్లు దొంగిలించేవాళ్లు. ఇంజిన్, నంబర్ ప్లేట్ మార్చి ఇంకో రాష్ట్రంలో అమ్మి సొమ్ము చేసుకునేవాళ్లు. కొంతకాలంగా దందా చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.6.24 కోట్ల విలువ గల 20 కార్లు, ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను మంగళవారం నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు.
ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో దొంగిలించి
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం బోత్యాతండాకు చెందిన రమావత్ సిరి నాయక్, హైదరాబాద్ హస్తినాపురానికి చెందిన కొడిమళ్ల పరిపూర్ణాచారి, మెదక్ జిల్లాకు చెందిన నర్సింహ.. ఫైనాన్స్ వాహనాల వేలం పాట వద్ద పరిచయమయ్యారు. వేలంలో వాహనాలు దక్కించుకొని అమ్ముకునే వారు. వీళ్లకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బొప్పా ఘోష్ పరిచమయ్యాడు. ఢిల్లీ, స్వరాష్ట్రంలో దొంగిలించిన కార్లకు ఇంజిన్, నంబర్ ప్లేట్లు మార్చి తక్కువ ధరకు నర్సింహ, పరిపూర్ణాచారి, నాయక్ ముఠాకు ఘోష్ అమ్మేవాడు.
ఇదే తరహాలో హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన పులాయిత్ అలీఖాన్, సికింద్రాబాద్‌కు చెందిన కలీంఖాన్, శైలేందర్ సింగ్, అంజద్ హుస్సేన్, మంచిర్యాల ఆర్‌టీఏ ఏజెంట్లుగా పని చేస్తున్న ఎండీ షకీల్, ఎండీ షఫీఉల్లాఖాన్ ముఠాకు కూడా కార్లు అమ్మేవాడు. ఇలా రెండు ముఠాలకు కలిపి ఢిల్లీలో అపహరించిన 16 కార్లను ఘోష్ అమ్మాడు.
మిర్యాలగూడ వాసి ఫిర్యాదుతో..
పశ్చిమ బెంగాల్ నంబర్ ప్లేట్‌తో ఉన్న రెండు కార్లను సిరినాయక్, పరిపూర్ణాచారి ఇటీవల మిర్యాలగూడకు చెందిన వీరస్వామికి అమ్మి కొంత డబ్బు తీసుకున్నారు. మిగిలిన డబ్బులు ఎన్‌ఓసీ (ఈ వాహనంపై ఎలాంటి కేసులు, ఫైనాన్స్ లేదు) వచ్చాక ఇవ్వమని చెప్పారు. వాళ్లు మిగతా డబ్బుల కోసం రాకపోవడంతో అనుమానం వచ్చి వీరస్వామి పోలీసులకు ఈ నెల 8న ఫిర్యాదు చేశాడు. సిరినాయక్, పరిపూర్ణాచారిలను పోలీసులు విచారించగా డొంక కదిలింది.
చోరీ చేసిన కార్లకు ఘోష్ నకిలీ ఎన్‌ఓసీ పంపగా మంచిర్యాల ఆర్‌టీఏ ఏజెంట్లుగా పనిచేస్తున్న ఎండీ షకీల్, ఎండీ షఫీఉల్లాఖాన్.. మంచిర్యాల ఆర్‌టీఏ అధికారులతో మాట్లాడి సుమారు 5 నుంచి 8 వాహనాలకు తెలంగాణ నంబర్ ప్లేట్లు వచ్చేటట్లు మార్చారు. పోలీసులు మొదటి ముఠా నుంచి 7, రెండో ముఠా నుంచి 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment