Ghatkesar Kidnapping Drama Incident B Pharmacy Student Commits Suicide - Sakshi
Sakshi News home page

Ghatkesar: కిడ్నాప్‌ డ్రామా యువతి ఆత్మహత్య

Published Wed, Feb 24 2021 11:37 AM | Last Updated on Wed, Feb 24 2021 12:41 PM

Ghatkesar Incident B Pharmacy Student Ends Her Life - Sakshi

సాక్షి, మేడ్చల్‌: నగరంలో పది రోజుల క్రితం ఫార్మాసీ విద్యార్థిని కిడ్నాప్‌ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చివరకు ఇదంతా డ్రామా అని తేల్చారు పోలీసులు. సదరు యువతిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత యువతి తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం యువతి షుగర్‌ ట్యాబ్లెట్స్‌ మింగి ఆత్మహత్యా యత్నం చేసింది.

గమనించిన కుటుంబ సభ్యులు ఆమెని ఘట్కేసర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి వరకు బాగానే ఉన్న యువతి బుధవారం ఉదయం 10 గంలకు చికిత్స పొందతూ మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటన తర్వాత విద్యార్థిని డిప్రెషన్‌కు గురైనట్లు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే...
మేడ్చల్‌ కండ్లకోయలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న ఆ విద్యార్థిని ప్రతిరోజూ లాగానే కాలేజీ రాంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగి ఆర్‌ఎల్‌ నగర్‌కు వెళ్లేందుకు సెవెన్‌ సీటర్‌ ఆటో ఎక్కింది. అప్పటికే ఆమె తండ్రి ఫోన్‌కాల్‌ చేస్తే మరికొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆమె తల్లి ఫోన్‌కాల్‌ చేస్తే ఆ బస్టాప్‌ వద్ద ఆగకుండా ఆటోడ్రైవర్‌ వేగంతో ముందుకు తీసుకెళుతున్నాడంటూ అరుస్తూ చెప్పింది. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్‌ చేసినా ఆమె ఫోన్‌ కనెక్ట్‌ కాలేదు. దీంతో ఈ విషయాన్ని డయల్‌ 100కు కాల్‌ చెప్పారు.

దీంతో అప్రమత్తమైన కీసర, ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, మేడిపల్లి పోలీసులతో పాటు ఎస్‌వోటీ పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ గాలించారు. చివరకు అన్నోజిగూడ చెట్ల పొదల్లో ఆమె పంపిన లైవ్‌ లోకేషన్‌తో ఆచూకీ లభించడంతో జోడిమెట్లలోని క్యూర్‌ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని చెప్పిన వివరాలతో మొదట కిడ్నాప్, ఆ తర్వాత నిర్భయ చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. 

తొలుత విద్యార్థిని చెప్పిన వివరాల ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు నలుగురు ఆటోడ్రైవర్లతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం వెళితే బాధితురాలు చెప్పిన వివరాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన కుదరకపోవడంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అలాగే 10న సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో యువతి యామ్నాంపేట, ఘట్‌కేసర్, అన్నోజిగూడ ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లుగా సీసీటీవీలకు చిక్కిన దృశ్యాలతో తేల్చారు.

అలాగే పోలీసుల అదుపులోకి తీసుకున్న అనుమానితుల సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆయా ప్రాంతాల్లో లేనట్లుగా తేలింది. ఈ కేసులో విద్యార్థిని చెప్పినట్లుగా ముఖ్య అనుమానితుడిగా భావించిన ఆటోడ్రైవర్‌ ఘట్‌కేసర్‌ రాకుండానే యామ్నాంపేట నుంచి తిరిగి ఈసీఐఎల్, అక్కడి నుంచి మల్టీప్లెక్స్‌ థియేటర్, ఆ తర్వాత వైన్‌షాప్‌కు వెళ్లినట్లుగా సీసీటీవీ కెమెరాల ద్వారా తేలింది.

దీంతో విద్యార్థినిని మరోసారి ప్రశ్నించగా ‘తల్లి పదేపదే ఫోన్‌కాల్‌ చేస్తుండటంతోనే ఈ డ్రామా ఆడానని, ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే ఇలా చేశాన’ని చెప్పింది. గతంలో కరోనా సమయంలో ఆటో చార్జీల విషయంలో ఓ ఆటోడ్రైవర్‌తో గొడవపడటంతో మనసులో పెట్టుకొని అతని పేరు చెప్పినట్లుగా బాధితురాలు చెప్పిందని సీపీ తెలిపారు. 6 నెలల క్రితం తన స్నేహితునితోనూ తనను కిడ్నాప్‌ చేశారంటూ కట్టుకథ అల్లిందని, 10 తేదీన కూడా ఆటోలో వచ్చేరోజూ తన సీనియర్‌ విద్యార్థితోనూ కిడ్నాప్‌ గురించి విషయాలు మాట్లాడిందని తేలిందన్నారు. కుటుంబ సమస్యలతోనే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుందని, అయితే సెల్‌ఫోన్‌ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు ఛేదించామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కీసర సీఐ జే.నరేందర్‌గౌడ్‌తో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో మహేశ్‌ భగవత్‌ సత్కరించారు.

చదవండి: 
ఘట్‌కేసర్‌ కేసు; రాడ్లతో విచక్షణ రహితంగా..
ఘట్‌కేసర్‌ అత్యాచారం కేసు: కొత్త ట్విస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement