![Gumastha Escaped with 10 kg of gold jewelery - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/29/gg.jpg.webp?itok=Nmqutv18)
జైహింద్ కాంప్లెక్స్‌లోని రాహుల్ జ్యూవెల్స్ దుకాణాన్ని పరిశీలిస్తున్న సీపీ శ్రీనివాసులు
సాక్షి, అమరావతి బ్యూరో: బంగారం షాపులో పనిచేసే ఓ గుమస్తా యజమాని కళ్లుగప్పి రూ. 4.84 కోట్ల విలువైన 10 కిలోల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. విజయవాడలోని గవర్నర్ పేటలో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గవర్నర్‌పేట జైహింద్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో మహవీర్ జైన్ అనే వ్యక్తి రాహుల్ జ్యువెలరీ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయనవద్ద రవితేజ, హర్ష అనే ఇద్దరు గుమస్తాలు పనిచేస్తున్నారు. అదే సముదాయంలోని ఐదో అంతస్తులో యజమాని మహవీర్ జైన్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కరోనా కారణంగా వ్యాపారం తక్కువగా జరుగుతుండటంతో మహవీర్ జైన్ ఆభరణాలను ఇంట్లోనే ఉంచి కొనుగోలు దారులు వచ్చినప్పుడు గుమస్తాలను పంపి వాటిని షాపులోకి తెప్పిస్తున్నాడు.
అనంతరం తిరిగి ఇంటికి పంపుతున్నాడు. మంగళవారం ఉదయం ఆభరణాలు తీసుకొచ్చేందుకు ఇద్దరు గుమస్తాలను యజమాని ఐదో అంతస్తులోని తన ఇంటికి పంపాడు. అతని భార్య, కుమారుడు రెండు బ్యాగుల్లో ఉన్న బంగారు ఆభరణాలను వారిద్దరికీ ఇచ్చి పంపారు. అనంతరం 11 గంటల తర్వాత ఆ ఆభరణాలను తిరిగి ఇద్దరు గుమస్తాలు యజమాని ఇంటికెళ్లి ఇచ్చి వచ్చారు.
మహావీర్ సోదరుడు ఇటీవల కోవిడ్ బారిన పడి స్థానికంగా ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో అతన్ని చూసి వచ్చేందుకు మహావీర్ 11.30 గంటల సమయంలో షాపు నుంచి ఆస్పత్రికి వెళ్లాడు. అదే అదనుగా భావించిన గుమస్తా హర్ష 12.30 గంటల సమయంలో యజమాని ఇంటికి వెళ్లి ఆభరణాలు అడిగాడు. ఎప్పటిలాగే కొనుగోలుదారులకు చూపడానికే అనుకుని మహవీర్ భార్య, అతని కుమారుడు తిరిగి రెండు బ్యాగుల్లో ఉన్న ఆభరణాలను హర్ష చేతికి అందజేశారు. రెండు బ్యాగులతో కిందకు వచ్చిన హర్ష దుకాణానికి వెళ్లకుండా వాటితో ఉడాయించాడు.
నగల దుకాణం కౌంటర్‌లో హర్ష (ఫైల్ ఫొటో)
ఆస్పత్రికి వెళ్లిన మహవీర్ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. బుధవారం యథావిధిగా దుకాణం తెరిచి ఆభరణాల కోసం ఆరా తీయగా.. అసలు విషయం బయట పడింది. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారం దుకాణంలో ఏడాది కాలంగా పనిచేస్తున్న హర్ష విజయవాడకు చెందినవాడేనని పోలీసులు గుర్తించారు. ఆభరణాలు అపహరించే ముందు హర్ష తనకు సంబంధించిన ఆధారాలు దుకాణంలో లేకుండా జాగ్రత్త పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటన విషయం తెలిసిన వెంటనే నగర సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment