సిరి, బోడి దంపతులు(ఫైల్)
సాక్షి, మహబూబాబాద్: కలకాలం తోడుండాల్సిన భర్తే కాటికి పంపాడు. అగ్నిసాక్షిగా ఒకటైనవాడే అనంతలోకాలకు పంపించాడు. సగభాగమైన సతికి తినే అన్నంలో విషం కలిపాడు. అనుమానం రావొద్దని ఆమె శరీరంపై గడ్డిమందు చల్లాడు. భార్యను ఆస్పత్రిలో చేర్పించాడు. తన రంగు ఎక్కడ బయటపడుతుందోనని తానూ చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసుల విచా రణలో ఆలస్యంగా ఈఘటన వెలుగులోకి వచ్చింది.
తాగుడుకు బానిసై.. భార్య తిడుతోందని!
తాగుడుకు బానిసైన మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని శనిగపురం గ్రామ శివారు బోడ తండాకు చెందిన బోడ సిరి(40), భార్య బోడ బోడి(35)లకు పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు అశోక్, జగన్. సిరి రోజూ తాగి ఇంటికొచ్చేవాడు. భార్య బోడి అతడిని తిట్టేది. ఈ క్రమంలో బోడిని వదిలించుకోవాలని అన్న లింగ్యాతో కలిసి భార్య బోడీ హత్యకు ప్రణాళిక వేశాడు. ఫిబ్రవరి ఒకటిన రాత్రి బోడి తినే అన్నంలో గడ్డిమందు కలిపాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
తామే హత్య చేసినట్లు అందరికీ తెలిసిపోతుందని బోడి ఒంటిపై గడ్డి మందు చల్లాడు. ఆమె ఆత్మహత్యకు యత్నించిందని అందరినీ నమ్మించాడు. ఏమీ తెలియనట్లుగా భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్యం బాగై ఎక్కడ అసలు విషయం బయటపడుతుందోనని.. ఫిబ్రవరి 14న సిరి చెట్టుకు ఉరేసుకున్నాడు. 20వ తేదీన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్య బోడీ కూడా మరణించింది. దీంతో పది, పదమూడేళ్లున్న ఇద్దరు కుమారులు అనాథలుగా మిగిలారు.
లింగ్యా అరెస్ట్
తమ్ముడితో కలిసి మరదలిని చంపేందుకు సహాయపడిన శనిగపురం శివారు బోడ తండాకు చెందిన లింగ్యాను పోలీసులు అరెస్టు చేసి శనివారం విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ కేసు వివరాలు, మృతురాలి ఆత్మహత్యలో అనుమానం రావడంతో పూర్తిస్థాయి విచారణ చేసినట్లు తెలిపారు. మరదలు బోడ బోడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రించడంలో తమ్ముడికి సహకరించిన లింగ్యాను రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో మహబూబా బాద్‌రూరల్ ఎస్సై అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment