గుడిపాల: జీవితాంతం కలిసి జీవిస్తానని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు గాలికొదిలేశాడు. కట్టుకున్న భార్యను ఆస్తి వివాదం నేపథ్యంలో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. స్థానికుల కథనం.. మండలంలోని కుప్పిగానిపల్లెకు చెందిన పశుపతి(43), ఇదే మండలంలోని గొల్లపల్లెకు చెందిన ప్రతిభ (34)కు 2006లో పెద్దలు వివాహం చేశారు. వీరికి వేదేష్(12), పవన్(5) సంతానం. పశుపతి వృత్తిరీత్యా బెంగళూరులో లిఫ్ట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఐదేళ్ల క్రితం తనే స్వయంగా లిఫ్ట్ కంపెనీ ప్రారంభించాడు. కంపెనీ బాగా అభివృద్ధి చెందుతున్న సమయంలో పశుపతి మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు తలెత్తేవి. గుడిపాల పోలీస్‌స్టేషన్‌లో కూడా గతంలో దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించి సర్దిచెప్పి పంపారు. గ్రామంలో కూడా పెద్దమనుషుల సమక్షంలో పలు పంచాయితీలు చేశారు. తరువాత దంపతులు కలిసి బెంగళూరుకు వెళ్లారు. అయినా పశుపతి తీరు మారలేదు.
మరింతగా తాగుడుకు అలవాడు పడటంతో విసిగి వేసారిన ప్రతిభ ఏడాది క్రితం భర్త నుంచి కంపెనీని తన పేరిట రాయించుకుంది. అప్పటినుంచి కంపెనీ వ్యవహారాలన్నీ ఆమే చూసుకునేది. దీనిపై పశుపతి ఆమెతో విభేదించాడు. తన ఇద్దరి పిల్లలను తీసుకుని తన స్వగ్రామానికి వచ్చేశాడు. ఇక్కడే ఉంటూ జీవిస్తున్నాడు. గ్రామస్తులు ఇది గమనించి మళ్లీ మధ్యస్థం చేశారు. అతడిని ఒప్పించి తిరిగి బెంగళూరుకు పంపారు. అయినా భార్యభర్తల మధ్య మళ్లీ గొడవలు వస్తుండడంతో తిరిగి వచ్చేశాడు. అయితే అప్పటినుంచి పశుపతికి భార్యపై అనుమానం మొదలైంది. ప్రతిభ వినాయకచవితి పండుగ సందర్భంగా తన పుట్టింటికి వచ్చింది. ఇది తెలుసుకున్న పశుపతి తన ఇంటికి రావాలంటూ ఆమెను నమ్మించి శనివారం తీసుకువచ్చాడు. సాయంత్రం మిద్దెపైన ఉన్న రూమ్‌లోకి ప్రతిభను తీసుకెళ్లి కట్టెతో తలపై బాదాడు. ఆ తరువాత కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. సంఘటన స్థలానికి సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ వాసంతి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
పోలీసుల అదుపులో పశుపతి
భార్యను హతమార్చిన పశుపతిని పోలీసుల అదుపులోకి తీసుకున్నాడు. హత్య ఎందుకు చేశాడో వివరాలు రాబట్టే దిశగా విచారణ చేస్తున్నారు. తల్లిని తమ తండ్రే హత్య చేయడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment