రేణుకతో బానయ్య
మంథని: కట్టుకున్న భార్యను అతికిరాతంగా చంపాడో భర్త. వేధింపులతో వేగలేకపోతున్నానని.. కలిసి కాపురం చేయడం కుదరదని పంచాయితీలో పెద్దమనుషుల సమక్షంలో చెప్పి భార్య ఇంటికి వెళ్తుండగా వెంటపడి బండ రాయితో మోది హతమార్చాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో శనివారం జరిగిందీ దారుణ సంఘటన.
తల్లీకూతుర్లను వేధిస్తుండటంతో..
గ్రామంలోని కాసిపేట బానయ్య.. అదే గ్రామానికి చెందిన కాసిపేట రేణుక (35)ను 17 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు ధనలక్ష్మి (16) ఉంది. దంపతుల మధ్య గొడవలు రావడంతో రేణుక మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. ఘట్‌కేసర్‌లో పనిచేసుకుంటూ జీవిస్తోంది. కూతురును కాటారం మండలం దామెరకుంటలోని వసతి గృహంలో ఉంచింది.
బానయ్య కూతురు వద్దకు వెళ్లి వేధిస్తుండేవాడు. రేణుకనూ వేధించేవాడు. దీంతో ఆమె మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్యకు తన ఆవేదనను చెప్పుకుంది. ఈ క్రమంలో శనివారం సర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలతో కలిసి పంచాయితీ పెట్టారు.
వేగలేకపోతున్నానన్న రేణుక
భర్తతో వేగలేకపోతున్నానని, తన బతుకు తాను బతుకుతానని పెద్ద మనుషుల ముందు రేణుక వాపోయింది. కలిసి ఉందామని బానయ్య బతిమిలాడినా.. ఒప్పుకోలేదు. దీంతో పెద్ద మనుషులు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. కూతురుతో కలిసి రేణుక వెళ్లిపోతుండగా బానయ్య వెంబడించిన భర్త బండ రాయి విసిరాడు.
అది రేణుక తలకు తగిలి కిందపడిపోయింది. వెంటనే మరో రాయితో తలపై మోదడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఘటనా స్థలాన్ని మంథని సీఐ సతీశ్, ఎస్సై చంద్రకుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి కూతురు ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భరించలేకనే..
‘నన్ను, మా అమ్మను డాడీ వేధిస్తున్నాడు. అతడి నుంచి దూరంగా వెళ్లిపోదా మనుకు న్నాం. వెనకాలే వచ్చి తలపై బండతో కొట్టాడు. నేను పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే కొట్టి చంపాడు. అతడి టార్చర్ భరించలేక 3 నెలల క్రితమే అమ్మ హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అడ్రస్ తెలుసుకుని అక్కడకూ వెళ్లి టార్చర్ పెట్టాడు. నాకు విషయం చెప్పడంతో నేను హాస్టల్ నుంచి మూడ్రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిపోయాను. మాట్లాడుకుందామని అమ్మను గ్రామానికి పిలిపించారు. అతడితో ఉండలేనని అమ్మ చెప్పింది. దాన్ని దృష్టిలోపెట్టుకుని కొట్టి చంపాడు..’ అంటూ ధనలక్ష్మి రోదిస్తూ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment