
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపేశాడు ఓ వ్యక్తి. అంతేకాదు భార్యను రెండు ముక్కలుగా చేసి.. వాటర్ డ్రమ్ములో దాచిపెట్టి పరారయ్యాడు.
మహబూబ్ నగర్ తండాకు చెందిన అనిల్, సరోజలు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ తరుణంలో పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా కూడా పరిస్థితి మారలేదు. శుక్రవారం సాయంత్రం సైతం ఇద్దరూ గొడవ పడినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ తరుణంలో శనివారం నుంచి సరోజా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మరోవైపు అనిల్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సరోజ తండ్రికి అనుమానం వచ్చింది.
ఈ క్రమంలో.. రెహమత్‌నగర్ సుభాష్ నగర్‌లో ఈ జంట ఉంటున్న ఇంటికి వచ్చాడు ఆయన. బయట తాళం వేసి ఉండడంతో మరోసారి అనిల్‌కు కాల్ చేశాడు. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసిన అనిల్.. పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. అనుమానంతో తాళం పగలగొట్టిన సరోజ తండ్రి.. లోపల దృశ్యాలు చూసి గుండె పగిలేలా రోదించాడు. చిన్న వాటర్ డ్రమ్‌లో సరోజ మృతదేహాం రెండు ముక్కలై పడి ఉంది.
సరోజను డంబెల్‌తో కొట్టి చంపి.. ఆపై రెండు ముక్కలుగా చీల్చేసి వాటర్ డ్రమ్‌లో కుక్కేశాడు అనిల్!. సరోజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనిల్ జాడ కోసం గాలింపు చేపట్టారు. సరోజ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment