న్యాయవాది తలకు గురిపెట్టిన గన్‌ ఎవరిది? | Hyderabad Lawyer Siddharth Singh Chaudhary at Gunpoint | Sakshi
Sakshi News home page

భూమిని దక్కించుకోవాలనే!

Published Wed, Feb 24 2021 7:36 PM | Last Updated on Wed, Feb 24 2021 7:55 PM

Hyderabad Lawyer Siddharth Singh Chaudhary at Gunpoint - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హిమాయత్‌నగర్‌: భూ వివాదంలో న్యాయవాదిపై జరిగిన హత్యాయత్నంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొంతకాలంగా మలక్‌పేటకు చెందిన వైద్యుడికి, ఓ వ్యక్తికి మధ్య భూమికి సంబంధించిన వ్యవహారంపై వాగ్వివాదం జరిగింది. ఆ భూమి ఎలాగైనా తనకే దక్కాలని మలక్‌పేటకు చెందిన డాక్టర్‌ మాలిక్‌.. హిమాయత్‌నగర్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌సింగ్‌ చౌదరిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో న్యాయవాది.. ఆ వ్యక్తితో కుమ్మక్కై కేసు ఓడిపోయేలా చేశాడంటూ డాక్టర్‌ మాలిక్‌ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో న్యాయవాదిని హత్య చేసేందుకు ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. 

ఫైల్‌ అడిగి దాడికి యత్నం.. 
ఈ నెల 16న హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌ నంబర్‌–7లో నివాసం ఉండే సిద్ధార్థ్‌సింగ్‌ చౌదరి వద్దకు గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు వచ్చారు. అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌కు తాము న్యాయవాదిని కలిసేందుకు వచ్చామని చెప్పి 2వ అంతస్తులోని సిద్ధార్థ్‌ సింగ్‌చౌదరి వద్దకు మాస్కులు, గ్లౌజులు ధరించి వెళ్లారు. వెళ్లగానే డాక్టర్‌ మాలిక్‌ ఫైల్‌ కావాలని అడిగారు. మీరెవరంటూ న్యాయవాది ప్రశ్నించాడు. ఆలోపే దుండగులు గన్‌ తీసి న్యాయవాది తలకు గురిపెట్టారు. కత్తులతో పొడిచేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే న్యాయవాది అరుస్తూ.. వారి నుంచి తప్పించుకుని బాల్కనీలోకి పరిగెత్తుకొచ్చాడు. అతడి అరుపులకు అపార్ట్‌మెంట్‌వాసులు, చుట్టుపక్కల వారు రావడంతో.. ఆ ముగ్గురు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. 

పోలీసుల అదుపులో నిందితులు! 
అప్పటికే సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడి చేసేందుకు పాల్పడ్డ దుండగులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఐదుగురు నిందితులు సంఘటనా స్థలానికి కారులో వచ్చారు. ఇద్దరు కారులోనే ఉండగా.. సిద్ధార్థ్‌ ఇంటిలోకి ముగ్గురు మాత్రమే వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. న్యాయవాది ఇంటి నుంచి 7 బుల్లెట్లు, నాలుగైదు కత్తులను, చిన్నపాటి రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

హత్యకు సుపారీ ఇచ్చిన వైద్యుడు 
ఘటన జరిగిన వెంటనే డాక్టర్‌ మాలిక్‌పై సిద్ధార్థ్‌ చౌదరి ఫిర్యాదు చేశారు. డాక్టర్‌కు సంబంధించిన వారే తనపై దాడి చేశారని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో డాక్టర్‌ మాలిక్‌కు, మరో వ్యక్తికి మధ్య వివాదం నడుస్తోందని చోటు చేసుకుంటున్నాయి. ఈ భూమి తనదంటే తనదంటూ.. ఇద్దరి మధ్యా కొంతకాలంగా వాగ్వివాదం జరుగుతోంది. అయితే ఈ కేసులో ఎలాగైనా గెలిచి ఆ భూమి దక్కించుకోవాలని డాక్టర్‌ మాలిక్‌.. సిద్ధార్థ్‌ సింగ్‌ చౌదరిని ఆశ్రయించారు. అయితే న్యాయవాది, తన ప్రత్యర్థితో కుమ్మక్కై కేసు ఓడిపోయేలా చేశాడని డాక్టర్‌ కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవాదిని అంతమొందించేందుకు ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చినట్లు తెలిసింది. వైద్యుడిని ఈ కేసునుంచి తప్పించేందుకు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఆ గన్‌ ఎవరిది..? 
ఈ ఘటనలో లభ్యమైన గన్‌ ఎవరిదనే దానిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. పోలీసులను దీనిపై ప్రశ్నించగా.. వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సమాధానం ఇచ్చారు. కాగా, ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నా.. ఈ విషయాన్ని కూడా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. సంఘటనా స్థలానికి సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయట్లేవు. దీంతో సమీపంలోని రెండు కిరాణా దుకాణాలకు చెందిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, కారులో ఉన్న మరో ఇద్దరు ఏమయ్యారు.. అసలు ఎందరు అరెస్టయ్యారు..నిందితులను రిమాండ్‌కు పంపారా అనే విషయాలపై పోలీసులు స్పష్టత ఇవ్వట్లేదు. 

చదవండి:
7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు!

3 నిమిషాల ముందు వెళ్లి.. 5 నిమిషాల్లో హత్య చేసి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement