సాక్షి, హైదరాబాద్: కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ బస్తీలో ఆత్మహత్య చేసుకున్న టీనేజర్ వ్యవహారంలో కొత్త విషయం వెలుగు చూసింది. ఆమెను క్షుద్ర పూజలు చేసి బలవన్మరణానికి పాల్పడేలా చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ ఇంటి ముందు ఎవరో క్షుద్ర పూజలు చేశారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు స్పందించలేదని నవ్య తల్లి చెబుతోంది.
బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది నవ్య. అయితే తమ ఇంటి ముందు వారం నుంచి ఎవరో పూజలు చేస్తున్నారని, మంత్రాలు చేసి తన కూతురిని చంపేశారని నవ్య తల్లి వాపోతోంది. ‘‘గత వారం రోజులుగా ఇంటి ముందు క్షుద్రపూజలు చేస్తున్నారు. నిమ్మకాయలు, దీపాలు, బొమ్మలు, పసుపు-కుంకుమతో పూజలు చేస్తున్నారు. వాటిని ఫొటోలు తీశాం. వాటిని తొలగించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. కానీ,
వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. పోలీసులు చర్యలు తీసుకుని.. నిందితులను పట్టుకుని ఉంటే ఇవాళ నా కూతురు ప్రాణాలతో ఉండేదేమో అంటూ సాక్షితో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది నవ్య తల్లి.
బుధవారం ఉదయం కూడా నవ్య బాగానే ఉందని, తనను.. తన భర్తను పనులకు నవ్వుతూ సాగనంపిందని, ఇవాళ(గురువారం) కాలేజీకి వెళ్తానని కూడా నవ్య చెప్పిందని ఆమె జరిగిందంతా వివరించారు. మరోవైపు నవ్య కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆత్మహత్య కేసును.. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment