ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,కాగజ్‌నగర్: కన్న ప్రేమ కనికరం చూపలేకపోయింది. కన్నతండ్రే కాల యముడయ్యాడు. ఆడపిల్లగా పుట్టినందుకు 40 రోజుల పసికందును బండరాయితో కొట్టి చంపేశాడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ మండలం మారేపల్లి పంచాయతీ లైన్‌గూడ గ్రామానికి చెందిన మెస్రం బాపురావు–మానస దంపతులు వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. మూడో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టింది. భారంగా భావించిన బాపురావు తాగిన మైకంలో సోమవారం అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
40 రోజుల పసికందును తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకెళ్లి రోడ్డుపై పడేసి, బండతో మోది చంపేశాడు. భార్య వారిస్తున్నా వినకుండా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంకా లోకం కూడా చూడని చిన్నారిని కిరాతకంగా హత్య చేశాడు. పక్కలోని బిడ్డను తీసుకెళ్లి తన కళ్లముందే చంపడంతో తల్లి కంటికి పుట్టెడుగా శోకిస్తోంది. కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్నట్లు కాగజ్‌నగర్ రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
చదవండి: నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’
ఆరేళ్ల బాలుడిని చితకబాది హతమార్చిన మారుతండ్రి
పటాన్‌చెరు టౌన్: ఆరు సంవత్సరాల బాలుడిని మారు తండ్రి చితకబాదడంతో మృతి చెందాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన నర్సింహులుకు 11 సంవత్సరాల క్రితం అరుణతో వివాహం జరిగింది. వీరికి జాన్‌పాల్, జస్వంత్, అరుణ్ (6) ముగ్గురు కుమారులు. కాగా నర్సింహులు మద్యానికి బానిసై సంవత్సరం క్రితం మృతి చెందాడు. అరుణ గద్వాలలో పనిచేస్తున్న సమయంలో వినయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నెలరోజుల క్రితం వినయ్, అరుణ మెదక్ చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇస్నాపూర్‌కు వచ్చి పద్మారావునగర్ కాలనీలో నివాసముంటున్నారు.
చదవండి: బాలికపై టీఆర్‌ఎస్ సర్పంచ్ అత్యాచారం.. బాధితురాలికి బండి పరామర్శ
అయితే వివాహం జరిగినప్పటి నుంచి వినయ్‌కు అరుణ్ అంటే ఇష్టం ఉండేది కాదు. చిన్నచిన్న విషయాలకు బాలుడిని కొట్టేవాడు. మంగళవారం కూడా అరుణ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంట్లోనే ఉన్న అరుణ్‌ని వినయ్ తీవ్రంగా కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అరుణ్ మృతిచెందినట్లు తెలిపారు. దీంతో బాలుడిని ఇంట్లో పడుకోబెట్టి వినయ్ పారిపోయాడు. డ్యూటీనుంచి తిరిగొచ్చిన తల్లికి కుమారుడు మృతిచెంది కనిపించాడు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment