Sensational Points Revealed In Disha Encounter Case, Details Inside - Sakshi
Sakshi News home page

Disha Encounter Case: నివేదిక బట్టబయలు.. వెలుగులోకి సంచలన విషయాలు.. 

Published Fri, May 20 2022 2:25 PM | Last Updated on Sat, May 21 2022 7:48 AM

Key Points In Disha Encounter Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్టుగానే ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న పది మంది పోలీసులపై హత్యానేరం కింద విచారణ చేయాలని తమ నివేదికలో సిఫార్సు చేసింది. కమిషన్‌ జనవరి 28నే సీల్డు కవర్‌లో 387 పేజీల సుదీర్ఘ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయగా.. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్‌ సెక్రటేరియట్‌ శుక్రవారం ఈ నివేదికను బహిర్గతం చేసింది. కమిషన్‌ తమ నివేదికలో ఎన్‌కౌంటర్‌ ఘటనకు సంబంధించిన అంశాలతోపాటు 15 సాధారణ సిఫార్సులు కూడా చేసింది. సత్వర న్యాయం పేరిట పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. నివేదికలో కమిషన్‌ పేర్కొన్న అంశాలివీ.. 

 ‘‘పోలీసులపై దాడి కట్టుకథ! 
పోలీసు అధికారి సైదుపల్లి అరవింద్‌ గౌడ్‌ను జొల్లు శివ కర్రతో.. మరో పోలీసు అధికారి కె.వెంకటేశ్వర్లును జొల్లు నవీన్‌ రాళ్లతో కొట్టారని పోలీసుల రిపోర్టులో ఉంది. గాయాలైన పోలీసులను షాద్‌నగర్‌ సీహెచ్‌సీకి, అక్కడి నుంచి కేర్‌ ఆస్పత్రికి తరలించినట్టు ఉంది. కానీ పోలీసు సిబ్బంది మెడికల్‌ రికార్డులో, మెడికో లీగల్‌ సర్టిఫికెట్‌లో వేర్వేరుగా గాయాల వివరాలున్నాయి. ఒక డాక్యుమెంట్‌లో వారిని కేర్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేసినట్టు ఉంటే.. మరోదానిలో ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్‌ చేసినట్టు ఉంది. కేర్‌ ఆస్పత్రిలో చికిత్స విషయానికొస్తే.. ఒరిజినల్‌ రికార్డులన్నీ సిట్‌కు ఇచ్చారు. కానీ కమిషన్‌ ముందు వాటిని ప్రవేశపెట్టలేదు. ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ కూడా ప్రవేశపెట్టలేదు. నుదుటికి గాయమైన పోలీసుకు సంబంధించి ఒకచోట కుడివైపు అని, మరోచోట ఎడమవైపు అని రాశారు. 

     ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయనేది, వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారనేది అబద్ధం. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు అపహరించారనేది కట్టుకథ, నమ్మశక్యం కానిది. తుపాకీలను అపహరించారనడానికి ఆధారాలను రూపొందించారు. ఇద్దరు అధికారుల నుంచి తుపాకీలు అపహరించారని ఒకసారి.. ఒక అధికారి నుంచే అపహరించారని పోలీసుల తరఫు సాక్షి వేర్వేరుగా చెప్పారు. 

నిందితులు కాల్పులు జరిపే అవకాశమే లేదు 
పోలీసుల నుంచి నిందితులు తుపాకీ అపహరించారనే అంశంలోనూ అనుమానాలు ఉన్నాయి. పోలీసు బెల్టుకు ఉండే పౌచ్‌ బటన్‌ తీసి 9ఎంఎం పిస్టల్‌ ఎలా అపహరించగలిగారు? నిందితులకు ఆయుధాల నిర్వహణ తెలుసనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. విచారణ సమయంలో సదరు పిస్టల్‌ను ఎలా నిర్వహిస్తారనేది అధికారులు చూపారు. ఆ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంది. తుపాకీలను ఉపయోగించడం తెలియని వ్యక్తి అంత సులభంగా వాడటం చాలా కష్టం. నిందితులు వాటిని వాడటం సాధ్యం కాదు. తుపాకీలో మేగజీన్‌ (బుల్లెట్లు ఉండే చాంబర్‌) లోడ్‌ పొజిషన్‌లో ఉందని అధికారులు చెప్తున్నారు. తుపాకీ కాల్చాలంటే పైభాగాన ఉన్న స్లయిడ్‌ను లాగడం ద్వారా చాంబర్‌లోకి బుల్లెట్‌ క్యాట్రిడ్జ్‌ వెళ్లేలా చేయాలి. సేఫ్టీ స్విచ్‌ ఎక్కడ అనేది సూచించే ఆధారాలు రికార్డుల్లో లేవు. శిక్షణ లేని వ్యక్తి సేఫ్టీ స్విచ్‌ను గుర్తించి తుపాకీ కాల్చడం సాధ్యం కాదని బాలిస్టిక్‌ నిపుణులు చెప్తున్నారు. నిందితులు ఆయుధాలు లాక్కొని వెంటనే కాల్పులు ప్రారంభించారన్న పోలీసుల ఆరోపణలు ఊహకు కూడా అందడం లేదు. 
     పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారా? ఆత్మరక్షణ కోసమా? నిందితులను పట్టుకోవడానికి ప్రతీకార కాల్పులు ప్రారంభించారా అనేది అస్పష్టంగా ఉంది. ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపారనేది తేలలేదు. కాల్పులు నిజంగానే జరిగాయని చెప్తుండటంపై అనుమానం తలెత్తుతోంది. మృతి చెందిన నలుగురి మొండెం, తలపై తుపాకీ గాయాలున్నాయి. అవి పరిశీలిస్తే పోలీసులు స్పష్టమైన లక్ష్యంతో ఉన్నట్టుగా విశ్వసించాల్సి వస్తోంది. 

ఎన్నో అంశాల్లో వ్యత్యాసాలు.. 
ఘటన ప్రాంతానికి సంబంధించి కొన్ని వీడియో ఫుటేజీలు కమిటీకి అందాయి. అవి ఒక ఆర్డర్‌లో లేవు. పైగా నిడివి తక్కువగా ఉన్న క్లిప్పింగ్‌లు. అవి ప్రాథమిక ఫుటేజీ నుంచి సేకరించినట్టుగా ఉన్నాయి. కమిషన్‌ ముందు పూర్తి ఫుటేజీ ఎందుకు ప్రవేశపెట్టలేదో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. సెక్షన్‌ 161 సీఆర్‌పీసీ కింద ఒకే సాక్షి వాంగ్మూలాన్ని పదేపదే ఎందుకు సేకరించారో కూడా చెప్పలేదు. మృతదేహాలను తరలించిన బస్సుకు సంబంధించి పలు లాగ్‌బుక్స్‌ ఉన్న అంశంపైనా సమాధానం లేదు. గాయపడిన పోలీసులకు సంబంధించి ఆస్పత్రిలో రికార్డు లేకపోవడం, ఖాళీ అయిన బుల్లెట్‌ క్యాట్రిడ్జ్‌లు అన్నీ తిరిగి సేకరించకలేకపోవడం, ఘటనాస్థలం నుంచి కాల్చి న బుల్లెట్లనూ సేకరించలేకపోవడం వంటివాటిని కేవలం దర్యాప్తులో లోపాలుగా చెప్పలేం. మృతదేహాలు, ఇతర వస్తువుల స్థానాల్లో కీలక తేడాలు, విచారణ నివేదికలు, క్రైం సీన్‌ పంచనామాల్లో వ్యత్యాసాలు చూస్తుంటే పోలీసుల వాదన నమ్మశక్యం కాదని నిర్ధారణ అవుతోంది. 

కస్టడీ అనుమతిలోనూ చట్ట ఉల్లంఘన 
జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ నిందితులను పోలీసు కస్టడీకి అనుమతించే సమయంలోనూ తీవ్రమైన చట్ట ఉల్లంఘన జరిగినట్టు తేలింది. ఎలాంటి పత్రాలను పరిశీలించకుండానే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మేజిస్ట్రేట్‌ ముందు ప్రొసీడింగ్స్‌ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గానీ, పోలీసు అధికారిగానీ లేరు. ఏసీపీ వి.సురేందర్‌ స్థానంలో ఓ కానిస్టేబుల్‌ ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఈ సందర్భంగా అజ్మల్‌ కసబ్‌ కేసులో సుప్రీంకోర్టు చేసిన సూచనలను గుర్తుంచుకోవాలి. బెయిల్‌ కోసం దరఖాస్తు/పోలీసు రిమాండ్‌ను వ్యతిరేకించడం/జ్యుడీషియల్‌ కస్టడీని వ్యతిరేకించడం వంటి అంశాల్లో నిందితులకు న్యాయ సలహా అవసరం. 

ఘటన నాటికి ముగ్గురూ మైనర్లే.. 
జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు ముగ్గురూ మైనర్లు.. పాఠశాల రికార్డులను పరిశీలించినప్పటికీ పోలీసులు వారి వయసును నమోదు చేయలేదు. మరణించే నాటికి ముగ్గురు మైనర్లేనని వారి బంధువులు కూడా పేర్కొన్నారు. ఆధార్‌ కార్డుల్లోనూ వారి పుట్టిన సంవత్సరం 2001గా నమోదై ఉంది. ఆధార్‌కార్డు పుట్టినతేదీకి అధికారిక రుజువు కాదు. ఈ నేపథ్యంలో పాఠశాల అడ్మిషన్‌ రిజిస్టర్‌లో నమోదు చేసిన విధంగా పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం ప్రాథమిక పత్రంగా ఉండాల్సింది.’’

నిందితులను చంపే ఉద్దేశంతోనే.. 

  • రికార్డుల్లోని అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం.. నిందితులు 6.12.2019 నాటి ఘటనలో ఆయుధాలను లాక్కోవడం, కస్టడీ నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేయడం, పోలీసులపై దాడి, కాల్పులు జరపడం వంటివి చేయలేదని నిర్ధారించాం. రెండో విషయం ఏమిటంటే నిందితులు 9ఎంఎం పిస్టల్‌తో కాల్చడమనే సందర్భమే తలెత్తలేదు. నిందితులంతా బుల్లెట్ల గాయాల కారణంగానే మరణించారు. వారిపై ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపిన పోలీసు అధికారుల చర్యలను సమర్థించడానికి వీల్లేదు. 
  • షేక్‌ లాల్‌ మదర్, మహమ్మద్‌ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవిలను 302 ఐపీసీ కింద విచారణ చేయాలి. ఈ అధికారులు ఐపీసీ సెక్షన్‌ 76, సెక్షన్‌ 300 ఐపీసీ (3) నుంచి మినహాయింపు పొందలేరు. ఎందుకంటే వారు నిందితులపై కావాలనే కాల్పులు జరిపారనే వాదన నమ్మదగినది. దీని ప్రకారం.. వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్‌ లాల్‌ మదర్, మహమ్మద్‌ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు, ఎస్‌.అరవింద్‌ గౌడ్, డి.జానకిరామ్, ఆర్‌.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్‌.. ఈ పది మందినీ కూడా ‘సెక్షన్‌ 302 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ, 201 రెడ్‌ విత్‌ 302 ఐపీసీ, 34 ఐపీసీ’ల కింద విచారించాలి. వేర్వేరు చర్యలు చేసినప్పటికీ నిందితులను చంపాలనే ఉద్దేశంతోనే వారు ఉన్నారు. 
  • ఆ పది మంది పోలీసులు కూడా నలుగురు నిందితులను సురక్షితంగా ఉంచే బాధ్యత కలిగిన వారే. ఏవైనా చర్యలు లేదా లోపాలు ద్వారా ఆ బాధ్యతలో విఫలమైతే.. నిందితుల మృతి పట్ల ఉమ్మడి ఉద్దేశం ఉన్నట్టుగానే భావించాలి. అంతేకాదు ఎన్‌కౌంటర్‌ తర్వాత రికార్డులు తారుమారు చేయడంలో వారి ప్రవర్తన, నిందితుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన తీరు చూస్తే వారి ఉమ్మడి ఉద్దేశం స్పష్టమవుతోంది. 
  • మాబ్‌ లించింగ్‌ (మూక దాడి) ఆమోదయోగ్యం కాదు. అదే విధంగా తక్షణ న్యాయం వంటి ఆలోచన కూడా ఆమోదయోగ్యం కాదు. ఏ సమయంలోనైనా చట్టం నియమాలు బలంగా ఉండాలి. నేరానికి శిక్ష అనేది చట్టం ఏర్పాటు చేసిన విధానం ద్వారానే ఉండాలి.

పోలీసులకు బాడీ కెమెరాలు పెట్టాలి 
విచారణ సమయంలో గమనించిన అంశాల మేరకు పలు సాధారణ సిఫార్సులు చేయాల ని నిర్ణయించినట్టు కమిషన్‌ నివేదికలో పే ర్కొంది. ఈ మేరకు 15 సిఫార్సులు చేసింది.  
∙మహిళలు, చిన్నారులపై దాడులకు సంబంధించి వెంటనే ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేయాలి. ∙ శాంతిభద్రతల నుంచి దర్యాప్తు విభాగాన్ని వేరు చేయాలి. ∙అరెస్టు సమయంలో రాజ్యాంగ, చట్టపరమైన అంశాలను తప్పనిసరిగా పాటించాలి. ∙దర్యాప్తు మొత్తం వీడియో రికార్డు చేయాలి. ∙ పోలీసుల శరీరానికి కెమెరాలు పెట్టాలి.  ∙ అన్ని కేసుల్లోనూ సీసీ టీవీ ఫుటేజీని తప్పనిసరిగా సేకరించాలి. ∙సాక్షుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలి. ∙క్రైం సీన్‌పై ఫోరెన్సిక్‌ నిపుణులకు పూర్తి బాధ్యత అప్పగించాలి. ∙అన్ని ఫోరెన్సిక్‌ ఆధారాలను వరుస క్రమంలో భద్రపర్చాలి. ∙ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ బాధ్యతలను ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ నిర్వహించడాన్ని నివారించాలి. ∙పోలీసు కస్టడీకి దరఖాస్తు చేసిన ప్రతీసారి నిందితుడిని హాజరుపర్చేలా మేజిస్ట్రేట్‌ ఆదేశించడాన్ని తప్పనిసరి చేయాలి. ∙పోలీసుల కస్టడీ పిటిషన్‌పై నిందితులకు నోటీసులు జారీ చేయాలి. ∙ సెక్షన్‌ 176(1–ఏ) కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్, 1973 కింద మేజిస్టీరియల్‌ విచారణ చేయాలి. ∙దర్యాప్తునకు సంబంధించిన పోలీసులు మీడియా సమావేశాలు నిర్వహించాలి. ∙అసత్య సాక్ష్యాలకు సంబంధించి చర్యలను సరళీకృతం చేయాలి.   

ఇది కూడా చదవండి: దిశ కేసు హైకోర్టుకు బదిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement