పోలీసులు స్వాధీనం చేసుకున్న రివాల్వర్, బులెట్లు, దాడిలో గాయపడ్డ జావేద్, వాజిద్
పటాన్‌చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని ఐలాపూర్ తండాలో.. ఇద్దరు కొత్త వ్యక్తులు తుపాకీతో తిరుగుతున్నారని స్థానికులు వారిపై దాడికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఐలాపూర్‌లో తమ పూర్వీకులకు చెందిన భూములు కోర్టు వివాదంలో ఉన్నాయని, వాటిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టి విక్రయిస్తున్నారని ఫొటోలు, వీడియోలు తీసి కోర్టులో దాఖలు చేసేందుకు హైదరాబాద్ మెహదీపట్నంలోని మురారీనగర్‌కు చెందిన అన్నదమ్ములు వాజిద్, జావేద్ బుధవారం ఉదయం బైక్‌పై తండాకు వచ్చారు.
వీరిని గమనించిన గ్రామ సర్పంచ్ భర్త రవి, కొత్త వ్యక్తులు తమ ప్రాంతంలో ఫొటోలు తీస్తున్నారని, వారి వద్ద రివాల్వర్ కూడా ఉందని కొందరు గ్రామస్తులతో కలసి వారిపై దాడికి దిగారు. అనంతరం వారిని అమీన్‌పూర్ పోలీసులకు అప్పగించారు. విచారణలో అమీన్‌పూర్ పోలీసులు జావేద్, వాజిద్‌ల వద్ద ఉన్నది లైసెన్స్ రివాల్వర్‌గా గుర్తించారు. తమకు సంబంధించిన భూముల్లో ఆక్రమణల ఫొటోలు తీసుకునేందుకు వెళ్లగా, సర్పంచ్ భర్త రవి, గ్రామస్తులను ఉసికొల్పి దాడి చేశాడని వారు డీఎస్పీ భీమ్‌రెడ్డికి తెలిపారు.
అయితే రివాల్వర్‌తో ఆ ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని అందువల్లే గ్రామస్తులతో కలసి ప్రతిఘటించామని రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన జావేద్, వాజిద్‌లను తొలుత స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించి, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
నలుగురికి రిమాండ్ : జావేద్, వాజిద్‌లపై దాడి చేసిన ఘటనలో అమీన్‌పూర్ పోలీసులు రవితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బుధవారం రాత్రి పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఈ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నలుగురిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు. పోలీసులు ఈ ఘటనలో ఓ రివాల్వర్‌తోపాటు ఏడు తూటా లను, సర్పంచ్ భర్త ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో ల్యాండ్ మాఫియాకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అండదండలు ఉన్నాయని పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆరోపించారు. అయితే దీనిని పోలీసులు కొట్టిపారేశారు. ఈ కేసుతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటన వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని డీఎస్పీ స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment