
నిందితులు పురుషోత్తం, పద్మజ దంపతులు (ఫైల్ ఫోటో)
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసు నిందితులను విశాఖ చినవాల్తేరులోని మానసిక వ్యాధుల చికిత్సాలయం నుంచి గురువారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. మదనపల్లికి చెందిన పురుషోత్తం, పద్మజ దంపతులు మూఢ విశ్వాసాలతో ఈ ఏడాది జనవరిలో తమ ఇద్దరు కుమార్తెలను అతి పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితులను పోలీసులు అరెస్టు చేసి మదనపల్లి సబ్‌జైలుకి తరలించారు. అయితే వారి మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించిన జైలు అధికారులు తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సిఫారసు మేరకు చినవాల్తేరులోని మానసిక వ్యాధుల చికిత్సాలయంలో చేర్పించారు. అప్పటినుంచి కౌన్సెలింగ్, చికిత్స పొందుతున్న వీరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో చికిత్సాలయం సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి ఆమోదంతో డిశ్చార్జి చేశారు. కాగా, పోలీసులు వీరిని తిరిగి మదనపల్లి జైలుకి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment