
వివాహ ముహూర్తం ఖరారైంది... పెళ్లి పనులు ఎలా చేయాలి... ఎవరెవరికి చెప్పాలి... ఈ హడావుడిలో పెళ్లికుమార్తె, పెళ్లి కుమారుడు కుటుంబాలు చర్చల్లో ఉన్నారు. ఇందులో భాగంగా రోడ్డుకు అటువైపు ఆటోలో ఉన్న కాబోయే భార్యతో మాట్లాడి వస్తుండగా మృత్యువు కాటేసింది.
విజయనగరం : మరికొద్ది రోజుల్లో వారిద్దరికీ వివాహం జరగబోతుంది. పెళ్లి కుమార్తె ఆటోలో ఉందన్న విషయం తెలిసిన ఆ యువకుడు ఆమెను చూసేందుకు వచ్చాడు. కొద్దిసేపు మాట్లాడి ‘బాయ్’ చెప్పి వెనక్కి తిరిగేలోపు వెనకనుంచి వస్తున్న బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బియ్యాలపేట వద్ద సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.మండల పరిధిలో బియ్యాలపేట సుంకరిపేట ప్రధాన రహదారిపై లెండి కళాశాలకు చెందిన బస్సు సుంకరిపేటకి చెందిన ఎస్.రామకృష్ణ (24)ను ఢీకొంది.
ఈ ఘటనలో బస్సు టైరు తలభాగంపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రామకృష్ణకు మే 30న వివాహం నిశ్చయమైంది. వధువు రోడ్డుపక్కన ఆటోలో ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్లి, పలకరించి, వెనక్కి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మరికొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన కుమారుడికి ఇలాంటి దుస్థితి వస్తుందనుకోలేదని తల్లిదండ్రులు సుంకరి బంగారునాయుడు, అప్పయమ్మ, కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబీకులు, స్థానికులు ఆగ్రహావేశాలకు గురై, రోడ్డుపైనే బైఠాయించారు. కళాశాల యాజమాన్యం వచ్చే వరకూ మృతదేహాన్ని తరలించేది లేదని నిరసన వ్యక్తం చేశారు. రూరల్ ఎస్‌ఐ పి.నారాయణరావు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని సమీక్షించి, గ్రామస్తులకు నచ్చజెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
చదవండి:
వీడిన మిస్టరీ: భార్యను ముక్కలుగా నరికి..
Comments
Please login to add a commentAdd a comment