యూపీలో మరో శ్రద్ధా వాకర్‌? నిందితునిపై పోలీసుల ఎన్‌కౌంటర్‌! | UP Man Who Pushed Girlfriend To Death Shot During Police Encounter | Sakshi
Sakshi News home page

Police Encounter: యూపీలో మరో శ్రద్ధా వాకర్‌? నిందితునిపై పోలీసుల ఎన్‌కౌంటర్‌!

Published Fri, Nov 18 2022 8:17 PM | Last Updated on Fri, Nov 18 2022 9:20 PM

UP Man Who Pushed Girlfriend To Death Shot During Police Encounter - Sakshi

అందులో భాగంగానే ఓ మొబైల్‌ ఫోన్‌ను గిఫ్టుగా ఇచ్చాడని తెలిపారు. నిందితుని పట్టుకునేందుకు 9 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అతని తలపై రూ.25 వేల రివార్డును కూడా ప్రకటించామని తెలిపారు.

ప్రేమో, ఆకర్షణో! తెలిసీతెలియని వయసు ప్రభావమో! అమాయక ఆడపిల్లల జీవితమైతే అర్ధాంతరంగా ముగుస్తోంది. నమ్మినవారే నట్టేటముంచితే ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోతోంది. కన్నవారికి పుట్టెడు దుఃఖం మిగుల్చుతున్న దారుణ ఘటనలు దేశంలో తరచూ వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. శ్రద్ధా వాకర్‌ ఘటన మరువకముందే ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలోనూ ఓ బాలిక ‘ప్రేమ’ మోసానికి బలైంది.

మృతురాలు నిధి గుప్తా (17) తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్‌ సూఫియాన్‌, నిధి ఏడాదికాలంగా రిలేషన్‌లో ఉన్నారు. ఇంట్లో అనుమానం రాకుండా ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన ఆ అమ్మాయి వ్యవహారం గత మంగళవారం బయటపడింది. దీంతో కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు వారు ఉంటున్న నాలుగో ఫ్లోర్‌లోని గదికి వెళ్లారు.

అక్కడ సూఫియాన్‌, నిధి.. ఆమె కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో నిధి అక్కడ నుంచి అపార్ట్‌మెంట్‌పైకి పరుగెత్తుకెళ్లింది. ఆమె వెంటే ఆ యువకుడు కూడా వెళ్లాడు. ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనలో ఉన్న అమ్మాయి కుటుంబ సభ్యులకు కెవ్వుమని కేక వినిపించింది. అంతే, తమ బిడ్డ కిందపడి విగతజీవిగా మారిందని తెలుసుకోవడానికి వారికి ఎంతోసేపు పట్టలేదు.

వేధించి, ప్రేమ పేరుతో..
అమాయకమైన తమ బిడ్డను సూఫియాన్‌ వేధింపులకు గురిచేశాడని ఆ తల్లిదండ్రులు ఆరోపించారు. లోకం తెలియని పిల్లకు మాయమాటలతో దగ్గరై ప్రేమ పేరుతో నమ్మించాడని తెలిపారు. మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని గత కొన్ని రోజులుగా వేధించినట్టు తెలిసిందని చెప్తూ వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు మాట వినడం లేదని ప్రాణాలు తీశాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.

పోలీసులు ఏం చెప్తున్నారంటే..
ఘటన జరిగిన అనంతరం సూఫియాన్‌ తప్పించుకుపోయాడని లా అండ్‌ ఆర్డర్‌ జాయింట్‌ కమిషనర్‌ పీయూష్‌ మోర్దియా తెలిపారు. మైనర్‌ను నిందితుడు ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఓ మొబైల్‌ ఫోన్‌ను గిఫ్టుగా ఇచ్చాడని తెలిపారు. నిందితుని పట్టుకునేందుకు 9 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అతని తలపై రూ.25 వేల రివార్డును కూడా ప్రకటించామని తెలిపారు.

ఎట్టకేలకు దొరికిన నిందితుడు
ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు సూఫియాన్‌ దొరికాడని కమిషనర్‌ తెలిపాడు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వారు ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. నిందితుని కాలులో బుల్లెట్‌ దిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. అతనిపై మర్డ్‌ర్ కేసుతోపాటు.. బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement