ఇంఫాల్: మణిపూర్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గతంలో తప్పిపోయినట్టు ప్రచరం జరిగిన ఇద్దరు విద్యార్థులు విగత జీవులుగా మారారు. వీరి ఫోటోలు ఇప్పుడు వైరల్ కావడంతో అక్కడి విద్యార్థులు నిరసన కార్యక్రమానికి తెరతీశారు. దీంతో మరోసారి అక్కడ ఇంటర్నెట్ సేవల వినియోగాన్ని నిషేధించింది రాష్ట్ర ప్రభుత్వం.
మే నెలలో జరిగిన అల్లర్లు మణిపూర్ రాష్ట్రంలో అల్లకల్లోలాన్ని సృష్టించాయి. మొత్తం 175 మంది ప్రాణాలు కోల్పోగా అనేకులు గాయపడ్డారు. వేలసంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. తరువాత కొన్నాళ్లకు అక్కడి పరిస్థితులు సద్దుమణగడంతో జులై 6న కొన్ని ఆంక్షలను సడలించింది మణిపూర్ ప్రభుత్వం. అందులో భాగంగానే ఇంటర్నెట్ సేవలపై ఉన్న ఆంక్షలను కూడా తొలగించింది. దీంతో అల్లర్ల సమయంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావడం మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్, హత్య కేసు కూడా వెలుగులోకి వచ్చింది.
జులై 6న ఆంక్షలు సడలించిన తర్వాత హిజామ్ లువాంబి(17) స్నేహితుడు హేమంజిత్(20)తో కలిసి నీట్ క్లాస్ కు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు వీరి తల్లిదండ్రులు. చివరిగా హిజామ్ ఫోన్ క్వాట్కా దగ్గర స్విచాఫ్ అయిందని ఆమె స్నేహితుడి ఫోన్ మాత్రం లమదాన్ వద్ద స్విచ్చాఫ్ అయినట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు.
చాలా రోజుల తర్వాత వారిద్దరికీ సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఒక ఫోటోలో హిజామ్ తెల్లటి టీషర్టులోనూ హేమంజిత్ చెక్ షర్టులోనూ కనిపించరు. ఆ ఫోటోలో వారి వెనుక ఇద్దరు తుపాకులు పట్టుకుని ఉండటాన్ని చూడవచ్చు. ఆ ఫోటోతో పాటే వారి మృతదేహాలు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో విద్యార్థులు నిరసనకు దిగారు. ర్యాలీగా వారు ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ఇంటిని ముట్టడి చేసే ప్రయత్నం చేయగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనంతరం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: ఢిల్లీలోని జ్యువెలరీ షోరూంలో రూ.25 కోట్ల నగలు చోరీ..
Comments
Please login to add a commentAdd a comment