సాక్షి,ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం వివాదంలో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలక వ్యక్తి, అనుమానిత వాహనం స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్ మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్ వాజేపై మరింత ఉచ్చు బిగ్గుస్తున్న నేపథ్యంలో మరో కీలక విషయాన్ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) వెల్లడించింది. హిరేన్‌ను బతికుండగానే నీటిలోకి తోసేసి ఉంటారనే అనుమానాలను ఏటీఎస్ వ్యక్తం చేసింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నిర్వహించిన డయాటమ్ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపింది. (అంబానీ ఇంటి వద్ద కలకలం: సంచలన ఆధారాలు)
డయాటమ్ (నీటిలో మునిగి చనిపోయిన మరణాల నిర్ధారణలో ముఖ్యమైన టెస్ట్) టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా ఏటీఎస్ హిరేన్ నీటిలో పడే సమయానికి జీవించే ఉన్నాడని భావిస్తోంది. ఊపిరితిత్తుల నీటి నిష్పత్తి ఈ పరీక్ష ద్వారా తేలిందని అయితే మరింత నిర్ధారణకోసం డయాటమ్ ఎముక నమూనాలను హరియాణా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపించామని ఏటీఎస్ డీఐజీ శివదీప్ లాండే చెప్పారు. అలాగే విసెరా, రక్త నమూనాలు, గోరు క్లిప్పింగుల నివేదికలు కూడా ఎదురు చూస్తున్నామన్నారు. కల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో హిరాన్ పోస్టుమార్టం చేసిన ముగ్గురు వైద్యుల వాంగ్మూలాలను రికార్డుచేయనున్నామని ఆయన చెప్పారు. హిరేన్ నోటిలో కుక్కిన రుమాలు, తదితర అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఏటీఎస్ అధికారి ఒకరు తెలిపారు అంతేకాదు పోస్టుమార్టం చేస్తున్నప్పుడు అరెస్టయిన సచిన్ వాజే ఆసుపత్రికి ఎందుకు వెళ్లారో కూడా దర్యాప్తు బృందం పరిశీలిస్తుందని మరో అధికారి తెలిపారు. (ముంబై పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు)
మరోవైపు ఈ వివాదంలో శివసేనపై ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి తన దాడిని ఎక్కు పెట్టారు. తాను సీఎంగా ఉన్న కాలంలో 2018లో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అప్పటికి సస్పెండ్ అయిన వాజేను తిరిగి రాష్ట్ర పోలీసు బలగాల్లోకి తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. కాగా అనుమానాస్పద స్థితిలో కొలనులో శవమై తేలిన హిరేన్ పోస్ట్‌మార్టమ్ నివేదికలో ముఖం, భుజాలపై గాయాలున్నట్టు తేలిన సంగతి విదితమే. అలాగే హిరేన్‌కు ఈతబాగా వచ్చని, నీటిలో మునిగి చనిపోయే అవకాశం లేదని సమీప బంధువు ఒకరు ఇప్పటికే వాదించారు. అటు, తన భర్త మెడలో బంగారు చైన్, ఉంగరం, మొబైల్, చేతిగడియారం, వాలెట్‌లోని ఆరేడు ఏటీఎం కార్డులు, కొంత నగదు కూడా మిస్సయినట్టు హిరేన్ భార్య విమలా ఆరోపించారు. తన భర్త మరణానికి సచిన్ వాజే కారణమంటూ ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment