సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టులకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు గమ్మెల కామేష్ అలియాస్ హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాలికొండ ఏరియా కమిటీలో హరి కీలకంగా వ్యవహరించేవారు. దీంతో హరిపై 50కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. అదే విధంగా అతనిపై రూ. 4లక్షల రివార్డును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ మావోయిస్టు తాంబేలు లంబయ్య హత్య కేసులో హరి ప్రధాన నిందితుడు. హరి అరెస్ట్ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు మాట్లాడుతూ.. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని పేర్కొన్నారు.
ముగిసిన వారోత్సవాలు
ఖమ్మం(చర్ల): మావోయిస్టు వారోత్సవాలు, బంద్ పిలుపుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో సుమారు రెండు వారాల పాటు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగింది. వారోత్సవాలు ముగియడంతో కూంబింగ్ ఆపరేషన్‌ను ముగించుకొని బలగాలు వెనుదిరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణాకు చెందిన గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలు పలు ధపాలుగా దండకారణ్యంలోకి వెళ్లాయి. మావోయిస్టుల చర్యలను కట్టడి చేసేందుకు బలగాలు రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించాయి. వారోత్సవాలు ముగిసినందున అడవులను విడిచి బలగాలు వస్తున్నాయనే సమాచారంతో సరిహద్దు ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక పక్క మావోయిస్టులు, మరో పక్క బలగాలతో సరిహద్దులోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలు.. తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని మారుమూల గ్రామాలు అట్టుడికాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సరిహద్దులో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గుండాల మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు, చర్ల మండలంలోని పూసుగుప్ప సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు, చెన్నాపురం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందడంతో పాటు పోలీసులు మందు పాతరలను వెలికి తీయడం.. వాటిని నిర్వీర్యం చేయడం, మావోయిస్టులు మందుపాతరలను ఏర్పాటు చేసి రహదార్లను పేల్చివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీస్ బలగాల్లో గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్ తుపాకీ మిస్‌ఫైర్ అయ్యి.. తూటాలు శరీరంలోకి దూసుకెళ్లి మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment